మూవీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలలో 'ఎస్ఎస్ఎంబి 29' ఒకటి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఎన్నో లీక్స్ బయటకు వచ్చాయి. కానీ డైరెక్టర్ రాజమౌళి మాత్రం తన ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ గురించి ఇప్పటిదాకా నోరు విప్పలేదు. కానీ తాజాగా ఒడిశా ఉపముఖ్యమంత్రి ఈ మూవీకి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. 


మహేష్ బాబు - రాజమౌళి మూవీపై ఒడిస్సా డిప్యూటీ సీఎం పోస్ట్... 


తాజాగా ఒడిస్సా డిప్యూటీ సీఎం చేసిన పోస్ట్ లో మల్కాన్ గిరిలో 'పుష్ప 2' సినిమా షూట్ చేశారని, ఇప్పుడు రాజమౌళి మూవీని కోరాపుట్ లో షూట్ చేస్తున్నారని పంచుకున్నారు. అంతేకాకుండా ఒడిస్సాలోని సుందరమైన ప్రదేశాలు చలనచిత్ర నిర్మాణానికి అనువైన గమ్యస్థానంగా మారుతున్నాయని ఆమె అన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో పర్యాటకులను మరింతగా పెంచుతుందని, చిత్ర నిర్మాతలకు ఒడిశాలో షూట్ చేయడానికి ఉత్సాహాన్ని పెంచుతుందని అన్నారు. 


ఆ పోస్ట్ లో "ఇంతకుముందు మల్కాన్ గిరిలో పుష్ప 2, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొత్త చిత్రం ఎస్ఎస్ఎంబి 29... సౌత్ సూపర్ స్టార్స్ మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన హీరోయిన్ ప్రియాంక చోప్రా మూవీ షూటింగ్ కోరాపుట్ లో జరుగుతుంది. ఇది షూటింగ్ కోసం సినిమాటిక్ ల్యాండ్‌స్కేప్‌ల సంపద ఒడిశాలో కావలసినంత ఉందని రుజువు చేస్తుంది. ఇది ఒడిశా పర్యాటక రంగానికి పెద్ద ఊపునిస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా సినిమాల చిత్రీకరణకు మెయిన్ షూటింగ్ స్పాట్ గా మారుతుంది. మేము ఒడిస్సాలో షూటింగ్ చేసుకోవడానికి అన్ని చిత్ర పరిశ్రమలను స్వాగతిస్తున్నాము. అలాగే కంప్లీట్ గా సపోర్ట్ చేస్తామని, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని వాగ్దానం చేస్తున్నాము" అంటూ రాసుకొచ్చారు. దీంతో రాజమౌళి, మహేష్ బాబు సినిమా షూటింగ్ ఇప్పుడు ఒడిశాలో ఎక్కడ జరుగుతుంది అన్న విషయం లీక్ అయినట్టుగా అయింది. 


Also Read:'కోర్టు చూడండి... నచ్చకపోతే నా 'హిట్ 3' చూడటం మానేయండి' అని నాని చెప్పారు. మరి, కోర్టు ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి






లీక్స్ కాకుండా మూడంచెల భద్రత 


'ఎస్ఎస్ఎంబి 29' మూవీకి సంబంధించిన వివరాలను ప్రైవేట్ గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు రాజమౌళి. కానీ ఏదో ఒక విధంగా సెట్స్ నుంచి సమాచారం లీక్ అవుతూనే ఉంది. ఇంతకుముందు ఒడిశాలో ఈ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు మహేష్ బాబు నటించిన ఓ సీన్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. ఆ లీకైన ఫుటేజ్ లో పృథ్వీరాజ్ వీల్ చైర్ లో ఉండగా, మహేష్ బాబు ఆయన ముందు మోకరిల్లినట్టుగా కనిపించింది. ఈ బిగ్ లీక్ తర్వాత నిర్మాతలు షూటింగ్ స్పాట్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. లీక్స్ ను అరికట్టడానికి మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. కానీ అంతలోనే ఒడిశా డిప్యూటీ సీఎం ఈ సినిమాపై ఇలాంటి బిగ్ అప్డేట్ ఇవ్వడంతో రాజమౌళి దీనిపై ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ రెండు భాగాలుగా రూపొందుతుండగా... మొదటి భాగం 2027లో, రెండవ భాగం 2029లో రిలీజ్ కానుంది.