‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును గెలవడం పట్ల దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సీని ప్రముఖుల నుంచి  రాజకీయ ప్రముఖుల దాకా అందరూ అభినందలను కురిపిస్తున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి కీర్తి ఆస్కార్ అవార్డుతో ఆకాశాన్ని అంటింది. ఈ నేపథ్యంలోనే ఆయన తండ్రి, ‘RRR’ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘RRR’ మూవీ ఆస్కార్ కు నామినేట్ అయిన సందర్భంగా ప్రధాని మోదీ తనతో ముఖ్యమైన విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పని, వాటిని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రయత్నించాలని కోరినట్లు వెల్లడించారు.


ప్రధాని మాటలు ఆశ్చర్యపరిచాయి - విజయేంద్ర ప్రసాద్


కొద్ది రోజుల క్రితం  ప్రధాని మోదీని కలిసినట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. రెండు, మూడు నిమిషాలు మాట్లాడాలి అనుకున్నా, దేశం గురించి, దేశ సంస్కృతి గురించి ఏకంగా 40 నిమిషాల పాటు మాట్లాడినట్లు చెప్పారు. భారత్ ను ప్రపంచ దేశాలు ఎలా చూడాలి అనుకుంటున్నాయో వివరించారు. ఆయన ఆలోచన చాలా ఆశ్చర్యపరిచిందన్నారు. ప్రధాని మోదీకి దేశ సంస్కృతిని విశ్వ వ్యాప్తం చేయాలనే విజన్ చూసి అవాక్కైనట్లు వెల్లడించారు.


స్పీల్ బర్గ్ ఏమన్నారంటే?


కొద్ది రోజుల క్రితం అమెరికాలో రాజమౌళిని కలిసిన సందర్భంగా ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్పీల్ బర్గ్ సైతం ఇలాంటి విషయాలే వెల్లడించినట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. భారతదేశానికి సంబంధించిన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా సినిమాలు తీయాలని రాజమౌళికి చెప్పారన్నారు. పాశ్చాత్య సంస్కృతిని, భారత సంప్రదాయాలకు ముడిపెట్టే ప్రయత్నాలు చేయకూడదనే విషయాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు.


‘RRR’ సినిమా కోసం శ్రమించిన మూడు తరాల వ్యక్తులు


ఇక ప్రపంచ వ్యాప్తంగా అద్భుత ప్రజాదరణ పొందిన ‘RRR’ సినిమా నిర్మాణంలో తమ కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు పని చేసినట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. తాను సినిమాకు కథ రాస్తే, రాజమౌళి దర్శకత్వం వహించారని చెప్పారు. రమా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తే, ఆమె తనయుడు కార్తికేయ మార్కెటింగ్ చేశారన్నారు. కీరవాణి సంగీతం అందిస్తే, ఆయన కొడుకు పాటలు ఆలపించినట్లు చెప్పారు.    


ప్రపంచ వ్యాప్తంగా కొత్త రికార్డులు నెలకొల్పిన ‘RRR’  


SS రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ మూవీ ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల నేపథ్యంలో కొనసాగుతుంది.  జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్ పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియా శరణ్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్  కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్డంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక సినీ అవార్డులను కైవసం చేసుకుంది.  


Read Also: ‘నాటు నాటు’ వెనుక ఎన్ని పాట్లో - 19 నెలల శ్రమ ఆ పాట, 110 రకాల స్టెప్పుల్లో ఆ ఒక్కటే ప్రత్యేకం!