Sriya Reddy about Pawan Kalyan: ఒకప్పుడు హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించి.. ఆ తర్వాత చాలా ఏళ్లు వెండితెరకు దూరంగా ఉన్నారు శ్రియా రెడ్డి. తాజాగా ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’తో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. అందులో రాధ రమా పాత్రలో కనిపించిన శ్రియా.. మరోసారి తన యాక్టింగ్ ప్రతిభ ఏంటో అందరికీ గుర్తుచేశారు. కానీ ‘సలార్’ తర్వాత తను అసలు సినిమాలు చేయడానికి సిద్ధంగా లేనని, ఏదైనా మంచి స్క్రిప్ట్ వస్తేనే చూద్దామని ఆలోచనలో ఉన్నానని తాజాగా బయటపెట్టారు శ్రియా. అలాంటిది ‘OG’ని తాను ఎందుకు ఒప్పుకుందో కూడా రివీల్ చేసింది.


ఎస్ చెప్పను అనుకున్నాను..


‘‘నాకు ఒకరోజు రవికే చంద్రన్ నుండి ఫోన్ వచ్చింది. ఆయన OGకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నాకు ఆయన చిన్నప్పటి నుండే బాగా తెలుసు. కుటుంబంలో మనిషిలాగా చూస్తాను. ఆయన నాకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ సినిమాలో అద్భుతమైన రోల్ ఉంది. డైరెక్టర్ సుజీత్ నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు అని చెప్పారు. ఏం వినక ముందే నేను చేయాలి అనుకోవడం లేదని చెప్పేశాను. ఆయన ఏం మాట్లాడకు, సుజీత్ నీకు ఫోన్ చేస్తాడు. అది చాలా అద్భుతమైన రోల్, నువ్వు ఒకసారి స్టోరీ వింటే బాగుంటుంది అన్నారు. అదొక కమర్షియల్ సినిమా, ఎలాగైనా నేను ఎస్ చెప్పను అన్న మైండ్‌సెట్‌తోనే సుజీత్‌తో మాట్లాడాను’’ అని సుజీత్‌తో మొదటిసారిగా మాట్లాడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు శ్రియా.


మైండ్‌లో ఫిక్స్ అయిపోయాను..


‘‘ఫోన్ చేయగానే సుజీత్ ఏం చెప్పారంటే.. నాకు ఫోన్‌లో కథ చెప్పడం కష్టంగా ఉంటుంది, చెన్నైకు వచ్చి కలుస్తాను, డైరెక్ట్‌గా కలిసి చెప్తాను అన్నారు. లేదండి ముందు ఫోన్‌లో చెప్పండి, నాకు నచ్చితే తర్వాత కలిసి మాట్లాడొచ్చు అన్నాను. సరే అని మొదలుపెట్టాడు. మాట్లాడడం మొదలుపెట్టిన 5 నిమిషాల తర్వాత నేను ఇది చేస్తాను అని మైండ్‌లో ఫిక్స్ అయిపోయాను. ఆయనకు చెప్పలేదు కానీ నా మైండ్‌లో ఈ క్యారెక్టర్ చేస్తున్నాను అనుకున్నాను. క్లైమాక్స్ అంతా చెప్పేసిన తర్వాత ఇది నా విజన్ అని చెప్పాడు. కథ చెప్పేశాను, శ్రియా ఏం చెప్తుంది, ఏం జరుగుతుందో అని తనకు కూడా భయమేసింది. నేను చేస్తాను అని చెప్పేశాను. ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారేంటి అని షాక్ అయ్యాడు. కానీ నా క్యారెక్టర్ గురించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తే తర్వాత చర్చించొచ్చు అన్నాను’’ అని ‘OG’ ఒప్పుకున్న సందర్భం గురించి చెప్పుకొచ్చారు.


స్పీచ్‌లు ఇష్టం..


‘‘నిజంగా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటి కూడా చూడలేదు. కానీ ఆయన పొలిటికల్ స్పీచ్‌లు, ఆయన గురించి అందరూ మాట్లాడే విషయాలు, రాసే విషయాలు.. అవి నచ్చాయి. నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఫాలో అవుతుంటాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా ఆయన పొలిటికల్ స్పీచ్‌లు వస్తుంటాయి. ఒక సందర్భంలో ఏంట్రా కొడకల్లారా అంటారు. ఆ పదం ఎక్కువగా అంటుంటారు. ఆయన స్పీచ్‌లు అంటే నాకు చాలా ఇష్టం. మనస్ఫూర్తిగా మాట్లాడతారు. కానీ OGని మాత్రం నేను స్క్రిప్ట్ వల్లే ఓకే చేశాను, దాని తర్వాత కళ్యాణ్ సార్‌తో పనిచేస్తున్నానని ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయ్యాను’’ అని తెలిపారు శ్రియా రెడ్డి.


Also Read: నా పేరు చెప్పి దొంగతనాలు చేయొద్దు - అభిమానికి నాగార్జున రిక్వెస్ట్