రివ్యూలు అనేవి ఎంత కాదన్నా ఏదో ఒక విధంగా సినిమా రిజల్ట్‌ను డిసైడ్ చేస్తాయి. ఒక్కసారి ఒక సినిమా మార్నింగ్ షోకు నెగిటివ్ రివ్యూ వచ్చిందంటే చాలు.. ఇక ఆ మూవీ సెకండ్ షో నుండి దానిని చాలామంది ప్రేక్షకులు పట్టించుకోవడం మానేస్తారు. కొందరు ప్రేక్షకులు మాత్రం రివ్యూలతో మనకి ఏం పని, నచ్చిన సినిమాకు వెళ్లిపోదాం అని అనుకున్నా కూడా ఎంతోకొంత ఈ రివ్యూల ప్రభావం అనేది ప్రేక్షకులపై ఉంటుంది. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఇదే విషయంపై చాలా ఫైర్ అయ్యారు. ‘బెదురులంక 2012’ సక్సెస్ టీమ్‌లో పాల్గొన్న శ్రీకాంత్.. రివ్యూ రైటర్స్‌పై స్టేజ్‌పైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.


దర్శకుడిని కలిసి దశాబ్దం అయ్యింది..
గత కొన్నేళ్లుగా తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అయిపోయారు శ్రీకాంత్ అయ్యంగార్. స్క్రీన్‌పై ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే శ్రీకాంత్ అయ్యంగార్‌కు ఆఫ్ స్క్రీన్ కూడా కోపం ఎక్కువే. ఆయన కీలక పాత్ర పోషించిన ‘బెదురులంక 2012’ సక్సెస్ మీట్‌లో మొదటినుండే సీరియస్‌గా ఉన్న శ్రీకాంత్.. సీరియస్‌గానే స్పీచ్‌ను మొదలుపెట్టారు కూడా. ‘బెదురులంక 2012’ను తెరకెక్కించిన దర్శకుడు క్లాక్స్‌ను దశాబ్దం కింద కలిశానని, ఇప్పుడు మళ్లీ తనతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత కార్తికేయతో పనిచేసిన అనుభవం గురించి కూడా శ్రీకాంత్ మాట్లాడారు.


తరువాతి సూపర్‌స్టార్ కార్తికేయ..
ముందుగా చావు కబురు చల్లగా సినిమాలో కార్తికేయతో కలిసి నటించానని గుర్తుచేసుకున్నారు శ్రీకాంత్ అయ్యంగార్. తరువాతి సూపర్‌స్టార్ అయ్యే చాలావరకు లక్షణాలు కార్తికేయకు ఉన్నాయని ప్రశంసించారు. పర్ఫార్మెన్స్, మంచితనం.. ఇలాంటి అన్ని క్లాలిటీస్ తనలో ఉన్నాయన్నాడు. చిరంజీవి పేరు పెట్టుకున్నాడు కాబట్టి కచ్చితంగా తరువాతి సూపర్‌స్టార్ అయిపోతాడని కచ్చితంగా చెప్పాడు. ఇంక ‘బెదురులంక’ సినిమా నిర్మాతకు కూడా డబ్బుల వర్షం కురవాలి, ఇలాగే ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు తీయాలి అని కోరుకుంటున్నట్టు శ్రీకాంత్ తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం పనిచేసిన చాలామంది గురించి ఆయన మాట్లాడారు. అదే సమయంలో రివ్యూల గురించి ఆయనకు ఆలోచన వచ్చి దాని గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.


సాధించి పనిచేసి రాస్తే పర్వాలేదు..
సినిమా వెనుక పడిన కష్టం జనాలకు తెలియదని, స్క్రీన్‌పై కనిపించేది మాత్రమే తెలుస్తుందని అన్నారు శ్రీకాంత్ అయ్యంగార్. ‘ఇంక రివ్యూలు, గివ్యూలు రాస్తారులే. ఏదైనా పీకుడు పనిచేసి, సాధించి ఇంకొకడి గురించి రాస్తే పర్వాలేదు. కెమెరా వర్క్ వస్తుంది, రాదు అని ఎవరో రాస్తే మనమెందుకు వింటాం. కాంతార అనే సినిమా ఉంది. దానికి ఒక రివ్యూ కూడా లేదు. అయినా జనాలు దానిని హిట్ చేయలేదా. ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి ఒక విషయం నచ్చితే కచ్చితంగా వచ్చి దానిని ఆదరిస్తారు. నచ్చకపోతే పట్టించుకోరు’ అంటూ రివ్యూలపై, రివ్యూలు ఇచ్చేవారిపై ఆగ్రహాన్ని బయటపెట్టారు. ఆపై తమ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని, థియేటర్లకు వచ్చి చూడమని కోరుకున్నారు. మామూలుగా రివ్యూ ఇచ్చే వ్యక్తులపై చాలామంది సినీ సెలబ్రిటీలకు కోపం ఉన్నా.. ఓపెన్‌గా స్టేజ్‌పై ఆ కోపాన్ని చూపించేవారు చాలా తక్కువ. అందులో ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఒకరు అయ్యారు.


Also Read: ‘నాటు నాటు’ సింగర్స్‌పై కొరియన్ పాప్ స్టార్స్ ఆసక్తికర వ్యాఖ్యలు - ఆ ఛాన్స్ కొట్టేస్తారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial