దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన పంథాను కొంచెం మార్చారా? ఈ సారి కాస్త మాసీగా సినిమా తీశారా? అంటే 'అవును' అని చెప్పాలట! సాధారణంగా ఆయన సినిమాల్లో కుటుంబ అనుబంధాలు, నేపథ్యాలు ఎక్కువ హైలైట్ అవుతాయి. అయితే, ఈ సారి రాజకీయాలు కూడా హైలైట్ కానున్నాయట. వరుణ్ తేజ్ 'ముకుంద' తర్వాత మరోసారి రాజకీయ నేపథ్యంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ఆయన రెడీ అయ్యారు. మౌనంగా చిత్రీకరణ అంతా పూర్తి చేసేశారు. జూన్ 2న ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ చేయనున్నారు. అయితే, సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని తెలిశాయి. 


'పెద కాపు'... ఈ టైటిలే ఫిక్స్!
Srikanth Addala New Movie : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్‌  సంస్థ ఓ సినిమా తెరకెక్కిస్తోంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'పెద కాపు' (Peda Kapu Movie) టైటిల్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 


నటుడిగా పూర్తిస్థాయి పాత్రలో శ్రీకాంత్ అడ్డాల
శ్రీకాంత్ అడ్డాలలో నటుడు కూడా ఉన్నారు. ఆ నటుడు ఇన్నాళ్ళు కేవలం అతిథి పాత్రలకు మాత్రమే పరిమితం అయ్యారు. అల్లు అర్జున్ 'ఆర్య'లో చిన్న పాత్ర చేశారు. వరుణ్ తేజ్ 'ముకుంద' చిత్రంలోని ఓ పాటలో కనిపించారు. వెతికితే ఈ విధంగా కొన్ని ఉంటాయి. అయితే, ఇప్పుడు పూర్తిస్థాయి పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు శ్రీకాంత్ అడ్డాల రానున్నారు. 


'పెద కాపు'లో శ్రీకాంత్ అడ్డాల ప్రధాన పాత్ర పోషించారని తెలిసింది. ఈ చిత్రంతో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సోదరుని కుమారుడు కథానాయకుడిగా పరిచయం కానున్నారని సమాచారం. సోదరుని కుమారుడా? లేదంటే ఎవరైనా బంధువా? అనేది ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలైనప్పుడు తెలుస్తుంది.


Also Read : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?


గోదావరి నేపథ్యంలో ఈ సినిమా కథ, కథనాలు సాగుతాయని సమాచారం. 'పెద కాపు' పదాన్ని గోదావరి జిల్లాలో విరివిగా వాడతారు. శ్రీకాంత్ అడ్డాల వచ్చింది కూడా గోదావరి నుంచే. తమిళ సినిమా 'అసురన్'కు రీమేక్ అయిన విక్టరీ వెంకటేష్ 'నారప్ప'ను మినహాయిస్తే ఆయన ప్రతి సినిమాలో గోదావరి యాస, పద్ధతులకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. 'పెద కాపు' సైతం అలాగే ఉంటుందేమో!?


ఎన్టీఆర్ ముఖ్యమంత్రి తదనంతర పరిణామాలు!?
'పెద కాపు' చిత్ర కథలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ప్రస్తావన ఉంటుందని తెలిసింది. సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తదనంతర పరిణామాల నేపథ్యంలో కథ, కథనాలు సాగుతాయని తెలిసింది. 


నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ'తో ద్వారకా క్రియేషన్స్ సంస్థ భారీ విజయం అందుకుంది. ఆ సినిమా కంటే ముందు కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయక' సినిమా తీశారు. ఇప్పటి వరకు అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి, తొలిసారి తన బంధువును హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేశారు. 


Also Read ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!