Amitabh Bachchan and Sridevi: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేయడానికి హీరోయిన్స్ అంతా ఆసక్తి చూపించేవారు. కానీ ఒకానొక సందర్భంలో శ్రీదేవి మాత్రం అమితాబ్‌తో నటించడానికి ఇష్టపడలేదట. ఆ సమయంలో శ్రీదేవిని ఒప్పించడానికి అమితాబ్ చేసిన పని గురించి ఇప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. అమితాబ్ బచ్చన్, శ్రీదేవి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే ‘ఖుదా గవా’. ఇద్దరి కెరీర్‌లో ఇదొక బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ‘ఖుదా గవా’ కంటే ముందు కూడా శ్రీదేవి, అమితాబ్‌లకు హిట్లు ఉన్నాయి. వీరిద్దరూ ఆ సమయంలో తమ కెరీర్‌లోని పీక్ స్టేజ్‌లో ఉన్నారు. కానీ ‘ఖుదా గవా’లో నటించడానికి ముందుగా శ్రీదేవి అంగీకరించలేదట.


శ్రీదేవిపై పుస్తకం..


శ్రీదేవి సినీ కెరీర్ గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి సత్యర్థ్ నాయక్ అనే రైటర్ ఒక పుస్తకాన్ని రాశారు. అదే ‘శ్రీదేవి - ది ఎటర్నల్ స్క్రీన్ గాడెస్’. ఈ పుస్తకంలో ‘ఖుదా గవా’ సినిమా సమయంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ రివీల్ చేసిన విషయాన్ని రాశారు. తనతో సినిమాలో నటించడానికి శ్రీదేవి సిద్ధంగా లేనందుకు తనను ఒప్పించడం కోసం ఒక ట్రక్ నిండా పువ్వులను పంపించారట అమితాబ్ బచ్చన్. ఆ ట్రక్‌పై ‘శ్రీదేవిని పువ్వులతో పూజిస్తున్నాను’ అని రాశారట. ఇది చూసి సెట్‌లో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారని సరోజ్ ఖాన్ గుర్తుచేసుకున్నారు. అప్పటికీ కూడా అమితాబ్‌తో కలిసి పనిచేయడానికి శ్రీదేవి ఒప్పుకోలేదట. ‘ఖుదా గవా’లో తన పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదని శ్రీదేవి ఫీల్ అయ్యారట.






షూటింగ్‌కు సెక్యూరిటీ..


ఆ తర్వాత అమితాబ్ బచ్చన్‌తో నటించడానికి శ్రీదేవి ఒక కండీషన్ పెట్టారట. తన భార్య లేదా కూతురి పాత్ర అయితేనే అమితాబ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటానని శ్రీదేవి చెప్పారట. అలా ‘ఖుదా గవా’ సినిమా చుట్టూ ఎన్నో ఆసక్తికర కథనాలు ఉన్నట్టు సత్యర్థ్ నాయక్.. తన పుస్తకంలో చెప్పుకొచ్చారు. 1992లో ఈ సినిమా షూటింగ్ అఫ్ఘానిస్తాన్‌లో జరిగింది. అప్పట్లో ఆ దేశానికి ప్రెసిడెంట్‌గా ఉన్న మహమ్మద్ నజీబుల్లా.. 18 రోజులు షూటింగ్‌కు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. బచ్చన్ ఫ్యామిలీకి ఈ సెక్యూరిటీ చాలా అవసరమని ఆయన భావించారట. అప్పట్లో అమితాబ్ బచ్చన్‌ను పలువురు టార్గెట్ చేసేవారని.. అందుకే ‘ఖుదా గవా’ షూటింగ్ కోసం అఫ్ఘానిస్తాన్ వెళ్లే ముందు నిర్మాతకు వార్నింగ్ కూడా ఇచ్చారట ఆయన తల్లి తేజీ బచ్చన్.


నిర్మాతకు అమితాబ్ తల్లి వార్నింగ్..


‘’అమిత్‌కు ఏమైనా జరిగి.. తన భార్య జయ తెల్లచీర కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే.. నీ భార్య కూడా తెల్లచీర కట్టుకుంటుంది’’ అంటూ నిర్మాత మనోజ్ దేశాయ్‌కు వార్నింగ్ ఇచ్చారట తేజీ బచ్చన్. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా రివీల్ చేశారు. ఇక అన్ని ఇబ్బందుల మధ్య షూటింగ్ జరుపుకొని, 1992లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఖుదా గవా’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దీంతో శ్రీదేవి, అమితాబ్ బచ్చన్ జంటకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అందుకే వీరిద్దరిని కలిసి క్యాస్ట్ చేయడం కోసం మేకర్స్ క్యూ కట్టారు. కానీ అందులో కొన్ని సినిమాలకు మాత్రమే శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.


Also Read: ఆ స్టార్‌ హీరోతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి - నిజమెంత?