ఎంత టాలెంట్ ఉన్నా.. సినీ పరిశ్రమలో వెనకబడిపోయిన నటులు చాలామందే ఉంటారు. ఒకప్పుడు హీరోలుగా హిట్లు కొట్టినా లక్ కలిసిరాక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా మిగిలిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారిలో శ్రీరామ్ ఒకరు. హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించినా.. అవకాశాలు లేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యాడు శ్రీరామ్. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తనకు ఇష్టం లేకపోయినా చిన్న చిన్న పాత్రలను చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడో, ఇకపై సినీ పరిశ్రమలో ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నాడో బయటపెట్టాడు. అంతే కాకుండా తన మొదటి సినిమా అనుభవాలను కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.


రవితేజ అంటే ఇష్టం కాబట్టి చేశాను..
‘‘సినిమావాళ్లకి ఏ కష్టాలు ఉండవని అనుకుంటూ ఉంటారు. మాకు ఏ పెంటలు ఉన్నాయో, ఎన్ని అప్పులు ఉన్నాయో వారికి తెలియదు కదా’’ అంటూ తను ఇష్టం లేకపోయినా సినిమాలు ఒప్పుకోవడానికి కారణాన్ని బయటపెట్టాడు శ్రీరామ్. ‘‘ఎక్కడో లాస్‌లో ఉండుంటాను. ఇప్పుడు ఆ డబ్బులను ఎలాగైనా సేకరించాలి. ఫ్యాన్సీ ప్రైస్ ఇస్తాను అన్నప్పుడు వదులుకోలేను కదా. చేసేద్దాంలే అనుకుంటాను’’ అన్నాడు. ఒకవేళ వద్దు, చేయను అనుకున్న పరిస్థితుల్లో కూడా తనను ఎవరైనా ఎక్కువగా అడిగితే ఒప్పేసుకుంటానని తెలిపాడు. అలా అని ఒకప్పుడు చేసిన తప్పులను ఇప్పుడు చేయాలని అనుకోవడం లేదని, ఇంక గెస్ట్ రోల్స్ చేయనని స్పష్టం చేశాడు. ‘‘గెస్ట్ రోల్‌లో ‘రావనాసురా’నే నా చివరి చిత్రం. రవిగారంటే నాకు చాలా అభిమానం, అందుకే ఆయన కోసం అది చేశాను. దాని తర్వాత వచ్చిన ఆఫర్లకు నో చెప్పేశాను. చిన్న సినిమా అయినా నాకు ప్రాముఖ్యత ఉంటేనే చేస్తాను’’ అని స్పష్టం చేశాడు.


బాలచందర్ కాళ్ల మీద పడ్డాను..
14 ఏళ్ల తర్వాత అవకాశం దొరికిందంటూ తాను లీడ్ రోల్స్ చేస్తున్న సినిమాల గురించి చెప్పుకొచ్చాడు శ్రీరామ్. అంతే కాకుండా తన తొలి పరిచయం బాలచందర్‌తోనే అని గుర్తుచేసుకున్నాడు. బాలచందర్.. ఒక సీరియల్ చేయమని తన దగ్గరకు వచ్చారని, కాలేజ్ సమయంలో ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంటుందని ఒప్పుకున్నానని, కానీ వారు ఇచ్చే రెమ్యునరేషన్‌కంటే దానికోసం తిరిగిన ఖర్చులే ఎక్కువ ఉన్నాయని శ్రీరామ్ బయటపెట్టాడు. సినిమాలో అవకాశం కోసం బాలచందర్‌ను అడిగినా అప్పుడో, ఇప్పుడో అనేవారని తెలిపాడు. అందుకే సీరియల్ నుండి తప్పించుకోవడం కోసం బాలచందర్ కాళ్ల మీద పడిపోయి, ఏవేవో అబద్ధాలు చెప్పి పారిపోయాడట శ్రీరామ్.


కాలు విరిగిపోయింది..
తన డెబ్యూ మూవీ ‘రోజా పూలు’ అనుభవాలను గుర్తుచేసుకున్నాడు శ్రీరామ్. ఆ సినిమా షూటింగ్ రెండేళ్లు జరిగిందని, ఎనిమిదిసార్లు ఆగిందని బయటపెట్టాడు. ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎప్పుడు గొడవపడతారో అని భయపెడుతూ ఉండేవాడట శ్రీరామ్. సినిమా విడుదలకు రెండు వారాలు ఉంది అనగా.. పాట పూర్తి చేయమని నిర్మాత చెప్పాడట. అది నచ్చక భూమిక పారిపోయిందని అన్నాడు శ్రీరామ్. ఫోన్ కూడా రీచ్ అవ్వలేదని తెలిపాడు. అయినా కూడా ఆ పాట సూపర్ సక్సెస్‌ఫుల్ అని గుర్తుచేసుకున్నాడు. నాగచైతన్య హీరోగా నటించిన ‘దడ’లో కూడా రెండున్నర నిమిషాల పాటు, డూప్ లేకుండా ఒక యాక్షన్ సీన్ చేశానని బయటపెట్టాడు శ్రీరామ్. కాలు విరిగిపోయింది.. అయినా కూడా ఆ సీన్‌ను సినిమా నుండి కట్ చేసి పారేశారని వాపోయాడు. ఇలాంటివి ఎన్నో చూశానని, ఒకరితో ఎప్పుడూ పోల్చుకోను అని సినిమా అంటే ఇష్టం ఉంది కాబట్టి కంటిన్యూ అవుతున్నానని శ్రీరామ్.. తన సినీ కెరీర్ గురించి గుర్తుచేసుకున్నాడు.


Also Read: జుహీ చావ్లాని పెళ్లి చేసుకోవడమే లక్ష్యం, అమ్మకి కూడా చెప్పా: మాధవన్