దివంగత నటి శ్రీదేవి దక్షిణాదిలో పాటు ఉత్తరాదిలో కూడా దిగ్గజ నటీమణులలో ఒకరన్న విషయం తెలిసిందే. ఈ అతిలోక సుందరి లుక్స్, నటనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సౌత్ ఆడియన్స్ మనసుల్లో ఆమె వేసిన ముద్ర చెరగనిది. అయితే ఈ హీరోయిన్ కేవలం అభిమానులు మాత్రమే కాకుండా స్టార్ హీరోల హృదయాలను సైతం కొల్లగొట్టింది. శ్రీదేవి కొడుకుగా నటించిన ఓ స్టార్ హీరో ఆమెతో ప్రేమలో పడి, ఆమెనే పెళ్లి చేసుకుంటానన్నాడన్న విషయం తెలుసా? సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ పెరిగింది. ఆ తర్వాత శ్రీదేవి అందానికి ఒ స్టార్ హీరో ఆమెతో ప్రేమలో పడ్డాడు. కానీ చివరికి ఆ విషయాన్ని చెప్పకుండానే ఓ విచిత్రమైన కారణంతో ఆయన వెనుతిరిగాడు. పరిస్థితుల కారణంగా తన భావాలను వ్యక్తపరచలేక పోయిన, శ్రీదేవి లాంటి అందగత్తెకు భర్త కాలేకపోయిన ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్.
ఆ హీరో కోసం 7 రోజుల పాటు ఉపవాసం
శ్రీదేవి రజనీకాంత్ చాలా సినిమాల్లో కలిసి నటించారు. కానీ శ్రీదేవి తన కెరీర్ ను బాల నటిగా ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఆమె 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1976లో తమిళ చిత్రం 'మూండ్రు ముడిచ్చు'లో ఏకంగా తల్లిగా నటించింది. ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించగా, శ్రీదేవి ఆయనకు తల్లిగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే శ్రీదేవి - రజనీకాంత్ జంటను తెరపై చూసి అప్పటి ప్రేక్షకులు తెగ మురిసిపోయేవారు. అలా శ్రీదేవితో కలిసి పని చేస్తున్నప్పుడే రజనీకాంత్ ఆమెతో ప్రేమలో పడ్డారట. డైరెక్టర్ కే బాలచందర్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి వెల్లడించారు. నిజానికి రజనీకాంత్ కంటే శ్రీదేవి చాలా చిన్నదని, అందుకే ఆమె పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారని వెల్లడించారు. అంతేకాకుండా శ్రీదేవి, రజనీకాంత్ తల్లులు కూడా ఒకరితో ఒకరు మంచి రిలేషన్ ను కలిగి ఉండేవారట. ఒకానొక టైంలో రజనీకాంత్ ఆరోగ్యం పాడైనప్పుడు ఆయన కోసం శ్రీదేవి ఏకంగా 7 రోజుల పాటు ఉపవాసం ఉందట.
లైట్స్ ఆఫ్ అయ్యాయని...
ఈ సంఘటన గురించి బాలచందర్ ఇంకా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు రజనీకాంత్ శ్రీదేవి దగ్గర తన భావాలను వ్యక్తపరచాలని భావించారట. కానీ ఆయన అక్కడికి వెళ్ళగానే శ్రీదేవి ఇంటి లైట్లు ఆఫ్ అయ్యాయట. దీంతో ఇదేదో మంచి సంకేతంలా అనిపించట్లేదు అనే ఆలోచనతో రజనీకాంత్ తన మనసులోని భావాలను శ్రీదేవి ముందు పెట్టకుండానే, అక్కడి నుంచి సైలెంట్ గా వెనుదిరిగాడట. ఇంకేముంది ఫలితంగా శ్రీదేవిపై రజినీకాంత్ ప్రేమ అక్కడితోనే ఆగిపోయింది. ఆ తర్వాత శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.