గత కొద్ది సంవత్సరాలుగా దక్షిణాది సినీ పరిశ్రమ అద్భుత సినిమాలతో సంచలన విజయాలను నమోదు చేస్తోంది. ఇక్కడ తెరకెక్కే చాలా సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. అంతేకాదు, విడుదలైన ప్రతి చోటా సంచలన విజయాలను అందుకుంటున్నాయి. కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్లను సాధిస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన ‘RRR,’ ప్రశాంత్ నీల్ రూపొందించిన ‘K.G.F 2,’ మణిరత్నం చారిత్రక సినిమా ‘పొన్నియిన్ సెల్వన్: 1,’ రిషబ్ శెట్టి ‘కాంతార’ మూవీ వసూళ్ల సునామీ సృష్టించాయి. దేశ వ్యాప్తంగా అద్భుత ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆదాయం ఓ రేంజిలో పెరిగింది. సౌత్ మీడియా, వినోద పరిశ్రమ 2022లో ఏకంగా 33% వృద్ధి సాధించింది. గత ఏడాది ఈ రంగం ఏకంగా $3.57 బిలియన్ల (భారత కరెన్సీ ప్రకారం రూ.29,253.41 కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసింది.


4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం ఆధారణంగా నివేదిక


సౌత్ ఇండియా: సెటింగ్ బెంచ్‌ మార్క్స్ ఫర్ ది నేషన్ ఇన్ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో  తాజాగా ఓ నివేదిక విడుదల అయ్యింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సౌత్ ప్రాంతం కోసం టీమ్ MCube ఇన్‌సైట్స్ ఈ నివేదిక రూపొందించింది. ఇటీవల ముగిసిన దక్షిణ్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ నివేదిక విడుదల చేశారు.  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో విస్తరించి ఉన్న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల వెక్టర్స్‌ లో - సినిమా, టెలివిజన్, స్ట్రీమింగ్/డిజిటల్, రేడియో మరియు ప్రింట్, ప్రకటనలతో సహా కీలక రంగాలను పరిగణలోకి తీసుకుని రూపొందించారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిని కూడా లెక్కలోకి తీసుకున్నారు.


ఏ రంగంలో ఎంత వృద్ధి నమోదయ్యిందంటే?


2022లో సినిమా పరిశ్రమ వృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. కరోనా ప్రభావిత 2021లో $486 మిలియన్ల ఆదాయం రాగా,  2022లో $955 మిలియన్ల ఆదాయం వచ్చింది. రాబడిలో 96% వృద్ధి నమోదు అయ్యింది. టెలివిజన్ 19% వృద్ధి చెంది 2022లో $155 మిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది; స్ట్రీమింగ్, డిజిటల్ 20% నుండి $366 మిలియన్లు; ప్రింట్ 14% నుండి $597 మిలియన్లు, రేడియో 24% నుండి $102 మిలియన్లకు పెరిగింది. అటు మీడియా, వినోద పరిశ్రమ రంగం 2023లో 17% వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. దేశ GDPలో 31%గా ఉండటం విశేషం.  


టాప్ ప్లేస్ లో తమిళ సినీ పరిశ్రమ


సౌత్ లో తమిళనాడు  $359 మిలియన్ల మార్కెట్ ను కలిగి ఉంది. ‘పొన్నియిన్ సెల్వన్: 1’,  ‘విక్రమ్’ లాంటి ఆల్-టైమ్ హిట్స్ ఈ సినిమా పరిశ్రమ నుంచే వచ్చాయి. వీటి తర్వాత ఆస్కార్-విజేత బ్లాక్‌బస్టర్ ‘RRR’ ద్వారా $305 మిలియన్ల మార్కెట్ పరిమాణంతో తెలుగు ఇండస్ట్రీ రెండో స్థానంలో ఉంది. ‘K.G.F: చాప్టర్ 2’, ’కాంతార’ లాంటి విజయాలను అందుకుని కన్నడ పరిశ్రమ $191 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచింది. ‘భీష్మ పర్వం’ లాంటి హిట్ మూవీతో  $99.4 మిలియన్ల మార్కెట్ ను కలిగి ఉండి మలయాళీ పరిశ్రమ నాలుగో స్థానంలో నిలిచింది.


నాలుగు భాషలకు సంబంధించిన చలనచిత్ర ఆదాయ మార్గాలలో కలిపి, స్థానిక థియేట్రికల్ రాబడి ద్వారా అత్యధిక భాగం $346 మిలియన్లు, డిజిటల్/స్ట్రీమింగ్ హక్కులు $224 మిలియన్లు,  శాటిలైట్ హక్కులు $161 మిలియన్లతో ఉన్నాయి. దక్షిణాది సినిమాలు దేశవ్యాప్తంగా ఎక్కువగా విడుదల అవుతున్న తరుణంలో, హిందీ, ఇతర ఉత్తర భారత భాషల డబ్బింగ్ రైట్స్ భారీ $135 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఈ నివేదికలో వివరించినట్లుగా, నాలుగు ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమల వృద్ధి కొత్త బెంచ్‌ మార్క్‌లను ఏర్పాటు చేశాయి.  


Read Also: ఉందనే కదా హింట్ ఇచ్చాం, ‘విరూపాక్ష’ సీక్వెల్ పై సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్!