Sonu Sood DeepFake Video: టెక్నాలజీ విపరీతంగా అడ్వాన్స్ అవ్వడం వల్ల మామూలు ప్రేక్షకుల దగ్గర నుండి సినీ సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తాజాగా డీప్‌ ఫేక్ వీడియో అనే ఒక టెక్నాలజీ సెలబ్రిటీలను వణికిస్తోంది. ఇప్పటికీ పలువురు హీరోయిన్లు.. ఈ డీప్ ఫేక్ వల్ల ఇబ్బందులు ఎదుర్కున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో ఒక నటుడు కూడా యాడ్ అయ్యాడు. తనే సోనూ సూద్. కష్టాల్లో ఉన్నవారికి తనవంతు సాయం చేయడం కోసం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు సోనూ సూద్. అలాంటి మంచితనాన్ని అడ్డం పెట్టుకొని కొందరు సైబర్ నేరగాళ్లు.. క్రైమ్స్‌కు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని సోనూ సూద్.. స్వయంగా తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.


తాజాగా జరిగిన ఘటన..
‘నా సినిమా ఫతే నిజ జీవిత సంఘటనలకు ఇన్‌స్పైర్ అయ్యి ఉంటుంది. ఇందులో డీప్ ఫేక్, ఫేక్ లోన్ యాప్స్ ద్వారా జరుగుతున్న సైబర్ నేరాల గురించి చూపించాం. ఇది తాజాగా జరిగిన ఘటన. ఇందులో చాటింగ్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా సోనూ సూద్ అని నమ్మించి ఒక కుటుంబం దగ్గర నుండి డబ్బులను దోచే ప్రయత్నం చేశాడు వ్యక్తి. చాలామంది అమాయకులు ఈ ట్రాప్‌లో ఇరుక్కుంటున్నారు. మీరందరూ ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను’ అంటూ తనలాగే ఉన్న ఒక వ్యక్తి.. ఒక కుటుంబానికి సాయం చేయడం కోసం వారి నుండే డబ్బులు అడుగుతున్నట్టుగా.. వారితో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు సోనూ సూద్.


చాలామంది బాధితులు..
సోనూ సూద్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూస్తుంటే అచ్చం తనలాగానే ఉన్నాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ పద్ధతిలో సైబర్ నేరగాళ్లు చాలామందిని మోసం చేశారంటూ ఫ్యాన్స్ చెప్పడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని.. సోనూ సూద్ పోస్ట్ చేసిన ఈ వీడియో కింద చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్‌లో బయటపెట్టారు. తమకు కూడా అలాంటి కాల్స్ వచ్చాయని, తమ నుండి కూడా డబ్బులు అడిగారని పలువురు ఫ్యాన్స్ వాపోయారు. ఈ సమాచారాన్ని అందించి.. అందరినీ అలర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ సోనూ సూద్‌కు ధన్యవాదాలు చెప్పుకున్నారు ఫ్యాన్స్. ఇక ఇలాంటి నేరగాళ్లపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తానని సోనూ సూద్ అందరినీ మాటిచ్చారు.






‘ఫతే’ కోసం రైటర్‌గా..
ఇక తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘ఫతే’ కోసం దర్శకుడిగా, రైటర్‌గా మారారు సోనూ సూద్. ఈరోజుల్లో సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే వాటిపై ప్రేక్షకుల్లో అవగాహన తీసుకొచ్చే విధంగా సినిమా కథను రాసుకున్నారు ఈ రియల్ హీరో. ఈ కథను రాసుకోవడం కోసం సోనూ సూద్.. సంవత్సరానికి పైగా కష్టపడ్డారట. దీనికోసం సైబర్ నేరాల బారిన పడినవారితో, సైబర్ క్రైమ్ పోలీసులతో, ఎథికల్ హ్యాకర్లతో మాట్లాడారట. వారి నుండి తీసుకున్న సమాచారంతోనే సోనూ సూద్.. ‘ఫతే’ను రాసుకున్నట్టు తెలుస్తోంది. ‘ఫతే నాకు చాలా పర్సనల్, స్పెషల్ సినిమా. సైబర్ క్రైమ్స్‌ వల్ల ఎన్నో విధాలుగా బాధితులు అయిన యువతకు ఇది అంకితం. రెడీగా ఉండండి’ అంటూ వారం క్రితమే ఈ మూవీ గురించి అప్డేట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు సోనూ సూద్.






Also Read: రజనీకాంత్‌ స్టైల్‌లో కరణ్‌జోహార్‌ యాక్టింగ్ - షాకైన కియారా, తమన్నా ఏమందో తెలుసా?