ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటించిన 'స్కంద'(Skanda) మూవీ ఇటీవల థియేటర్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. రామ్ పోతినేని - బోయపాటి కాంబినేషన్లో మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు రామ్ కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది. విడుదలకు ముందు టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా విడుదల రోజు భారీ ఓపెనింగ్స్​ని అందుకుంది. రామ్ కెరియర్​లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ 'స్కంద' మూవీకి రావడం విశేషం.


కానీ రెండవ రోజు నుంచి సినిమాకి డివైడ్ టాక్ రావడంతో రోజురోజుకీ కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. అలా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ తో సరిపెట్టుకుంది. కాగా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. 'స్కంద' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. దీంతో అక్టోబర్ 27వ తేదీన 'స్కంద' మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం వినిపిస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం లో ఈ మూవీ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది. 'స్కంద'ని బోయపాటి తనదైన మార్క్ ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు.


ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. మొదటిసారి ఊర మాస్ లుక్​లో రామ్ పోతినేని అదరగొట్టేసాడు. దానికి తోడు ఈ మూవీలో రామ్ డ్యూయల్ రోల్​లో నటించి మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్​లు తప్పితే కథ, కథనం పరంగా స్కంద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రివ్యూలు కూడా మిశ్రమంగా రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్​ని అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీలో రామ్ పోతినేని సరసన శ్రీలీలా హీరోయిన్​గా నటించగా, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రలో కనిపించింది.


సీనియర్ హీరో శ్రీకాంత్, ప్రిన్స్, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ, పృధ్విరాజ్ కీలకపాత్రలు పోషించారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్, జి స్టూడియోస్ సంస్థలపై శ్రీనివాస చిట్టురి, పవన్ కుమార్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. కాగా ప్రస్తుతం రామ్ పోతినేని పూరి జగన్నాథ్ తో 'డబుల్ ఇస్మార్ట్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్' కి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చ్ 8 శివరాత్రి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : ఏఐను నడిపించేది మనుషులే - సినిమా ఇండస్ట్రీపై ఏఐ ప్రభావం గురించి రానా ఏమన్నారంటే?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial