'ధమాకా' తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మాస్ మాహారాజా రవితేజ.. ఈ ఏడాది సమ్మర్​లో 'రావణాసుర' సినిమాతో ప్లాప్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు' అనే బయోగ్రాఫికల్ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్​తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దసరా సందర్భంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే సినిమా నిడివి 3 గంటలకు పైగా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 


1970లో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మోస్ట్ వాంటెడ్ స్టూవర్ట్ పురం గజదొంగ 'టైగర్' నాగేశ్వరరావు జీవితంలోని సంఘటనలు, ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బుధవారం చిత్ర బృందం సెన్సార్​కు వెళ్లగా, జ్యూరీ సభ్యులు మూవీ చూసి 12 కట్స్​తో 'యూ/ఎ' (U/A) సెర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మూడు సన్నివేశాల్లోని దృశ్యాలకు కత్తెర వేసిన సెన్సార్ బోర్డ్.. కొన్ని సీన్స్​లో అభ్యంతరకమైన పదాలను మ్యూట్ చేయాల్సిందిగా మేకర్స్​కు సూచించింది. దీంతో ఫైనల్​గా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా రన్ టైమ్ 3 గంటల 01 నిమిషాల 45 సెకండ్లు (181 నిమిషాలు) వచ్చింది. 2023లో ఇప్పటివరకూ ఎక్కువ నిడివితో రాబోయే తెలుగు చిత్రం ఇదేనని చెప్పాలి. 


సాధారణంగా సినిమా నిడివి 2 గంటల నుంచి 2.45 గంటల మధ్య ఉండేలా చూసుకుంటుంటారు. ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టటానికి ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా వీలైనంత వరకూ, క్రిస్పీగానే సినిమా ఉండాలని మేకర్స్ భావిస్తుంటారు. ఈరోజుల్లో ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలను ఎక్కువసేపు సీట్లో కూర్చోబెట్టడం కష్టంగా మారింది కాబట్టి, ఎక్కువ రన్ టైమ్ అనేది రిస్కీ అని ఆలోచించి జాగ్రత్త పడేవారు కూడా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా లెన్త్ 3 గంటలు దాటడంతో, నిడివి ఏమైనా ప్రతికూలాంశంగా మారుతుందేమో అని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 


నిజానికి గతంలో 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ రన్ టైమ్​తో వచ్చిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్​గా నిలిచాయి. 'మహానటి', 'అర్జున్ రెడ్డి', 'బాహుబలి' వంటి చిత్రాలు నిడివి అనేది సమస్య కాదని తెలియజెప్పాయి. గతేడాది 'ది కాశ్మీర్ ఫైల్స్', KGF 2, RRR, 'విక్రమ్' లాంటి సినిమాలు సుదీర్ఘ రన్ టైంతో వచ్చి హిట్లు కొట్టాయి. మంచి కంటెంట్, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని, నిడివి అడ్డంకి కాదని నిరూపించాయి. అదే సమయంలో ఎక్కువ లెన్త్​తో వచ్చి ప్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.


విక్రమ్ నటించిన 'కోబ్రా' సినిమా 3 గంటల నిడివితో వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్​గా మారింది. మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్' మూవీ కూడా మూడు గంటలపైనే ఉంది. ఈ సినిమా మిగతా భాషల్లో విజయం సాధించినప్పటికీ, తెలుగు ఆడియన్స్​ను మాత్రం ఎంగేజ్ చేయలేకపోయింది. అలానే ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా లెన్త్ ఒక నిమిషం తక్కువ 3 గంటలు ఉంది. ఈ పౌరాణిక సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 


దీన్ని బట్టి స్ట్రాంగ్ కంటెంట్ ఉండి, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా నడిపిస్తే.. లాంగ్ రన్-టైమ్ అయినా వర్క్ ఔట్ అవుతుందనేది స్పష్టం అవుతుంది. కానీ కొంచెం తేడా కొట్టినా నిడివే మైనస్ గా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైతే 'టైగర్ నాగేశ్వరరావు' నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసాయి.. కావాల్సినంత బజ్ తీసుకొచ్చాయి. మరి థియేటర్లలో ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో వేచి చూడాలి.


'టైగర్ నాగేశ్వరరావు' అనేది రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అందుకే మాస్ రాజా నార్త్ లో దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్, మయాంక్ సింఘానియా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే అక్టోబర్ 19న యూఎస్ ప్రీమియర్స్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 


Also Read: 2023 Dussehra Movies: దసరాకు అన్ని యాక్షన్ సినిమాలే.. వాటి సెన్సార్, రన్‌టైమ్ అప్​డేట్స్ ఇవే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial