Sivakarthikeyan about Ayalaan: సంక్రాంతికి నాలుగు తెలుగు సినిమాలతో పాటు రెండు తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ తెలుగులోనే పోటీ ఎక్కువగా ఉండడంతో డబ్బింగ్ చిత్రాలు విడుదల అవ్వకుండా వెనక్కి తగ్గాయి. ఇప్పుడు  ఆ రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు మళ్లీ ఒకేరోజు పోటీపడనున్నాయి. అవే ‘కెప్టెన్ మిల్లర్’, ‘అయలాన్’. ఈ రెండు సినిమాలు తమిళంలో సక్సెస్ టాక్‌ను అందుకున్నాయి. జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తెలుగులో ‘అయలాన్’ విడుదలకు సిద్ధమవ్వడంతో హీరో శివకార్తికేయన్.. ఇక్కడ ప్రమోషన్స్‌ను ప్రారంభించాడు. సినిమా గురించి ఇంట్రెస్టెంట్ విషయాలను పంచుకున్నాడు.


ఐడియా కొత్తగా ఉంది..


‘అయలాన్’ అనేది గ్రహంతరవాసి, మనిషికి మధ్య ఫ్రెండ్‌షిప్‌కు సంబంధించిన కథ. ఇక ఈ కథ తనకు ఎలా అనిపించిందో శివకార్తికేయన్ చెప్పుకొచ్చాడు. ‘‘మన ప్రేక్షకులకు ఈ ఐడియా చాలా కొత్తది. ఈ సినిమా చేయడానికి అదే అసలైన కారణం. నేను, ఒక ఏలియన్ ఒక సినిమాలో ఎలా కనిపిస్తాం. రెండున్నర గంటలు దర్శకుడు ఎలా చూపిస్తాడు. ప్రేక్షకులకు ఏం ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నాడు’’ అని కథ విన్నప్పుడు తనకు ఎలా అనిపించిందో తెలిపాడు శివకార్తికేయన్. ఇక ఏలియన్ అనేది గ్రాఫిక్స్‌లో తయారు చేయబడుతుంది. కానీ షూటింగ్ సమయంలో మాత్రం అక్కడ ఎవరూ లేకపోయినా.. ఏలియన్ ఉన్నట్టు ఊహించుకొని డైలాగులు చెప్పాలి, నటించాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ తనకు ఎలా అనిపించిందో శివకార్తికేయన్ బయటపెట్టాడు.


కొన్నిరోజులు కష్టంగా ఉండేది..


‘‘అది చాలా కష్టమైన ప్రక్రియ. 2,3 రోజులు కొంచెం కష్టంగా అనిపించింది. ఎక్కడ చూడాలి అని అర్థమయ్యేది కాదు. ప్రతీసారి దర్శకుడిని అడిగేవాడిని. తనేమో ఏలియన్ ఎగురుతుంది, ఏలియన్ పరిగెడుతుంది అని చెప్పేవాడు. మనం ఊహించుకోవాలి అంతే. ‘ఈగ’కు కూడా అదే జరిగింది. ఆ సినిమా సమయంలో సుదీప్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. అందులో ఈగ అక్కడుంది, ఇక్కడుంది అని చెప్పేవారు, అక్కడే చూడాల్సి వచ్చేది అని సుదీప్ చెప్పారు. నా విషయంలో కూడా వారం తర్వాత అదొక ప్రాక్టీస్‌లాగా అయిపోయింది. మనం అందులో మునిగిపోతాం. మా దగ్గర ఒక బొమ్మ ఉండేది రిఫరెన్స్‌లాగా. తర్వాత దానిని తీసేసి యాక్ట్ చేసేవాళ్లం’’ అంటూ ఏలియన్‌తో మాట్లాడినట్టుగా ఊహించుకోవడం ఎంత కష్టంగా ఉండేది రివీల్ చేశాడు శివకార్తికేయన్.


పూర్తి కథ లేకుండానే..


2024 జనవరి 12న ‘అయలాన్’ తమిళ వర్షన్ థియేటర్లలో విడుదలయ్యింది. ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’కు పోటీగా దిగడంతో ‘అయలాన్’ను ఎవరూ పట్టించుకోరేమో అని చాలామంది భావించారు. కానీ ఫైనల్‌గా కలెక్షన్స్ విషయంలో ‘అయలాన్’ మంచి సక్సెస్‌ను అందుకుంది. మౌత్ టాక్ బాగుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్.. ‘అయలాన్’ను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఇక తమిళంలో మౌత్ టాక్ బాగుండడంతో తెలుగులో కూడా ప్రేక్షకులు దీనిని ఎక్కువగా చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.91 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది ఈ సినిమా. దర్శకుడు రవికుమార్.. పూర్తిస్థాయి కథను సిద్ధం చేసుకోకముందే, కేవలం ఏలియన్‌తో ఫ్రెండ్‌షిప్ అన్న ఆలోచనతోనే శివకార్తికేయన్‌ను కలిశానని, అయినా తనతో నమ్మకంతో హీరో ‘అయలాన్’ చేయడానికి ఒప్పుకున్నాడని బయటపెట్టాడు.


Also Read: పద్మ విభూషణ్‌కు ముందు చిరంజీవికి వచ్చిన అవార్డులు, లభించిన సత్కారాలు తెలుసా?