Chiranjeevi awards and honours list: తెలుగు ప్రజల హృదయాల్లో అన్నయ్యగా చెరగని స్థానం సొంతం చేసుకున్న కథానాయకుడు చిరంజీవి. చిత్రసీమలో తొలి సుప్రీమ్ హీరో చిరంజీవి. ప్రేక్షకులు అందరి మనసులో గూడు కట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి. ఆయన కీర్తి కిరీటంలో మరో పురస్కారం చేరింది. ఆయనకు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ (Padma Vibhushan awards 2024)తో ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డు కంటే ముందు చిరంజీవికి ఎన్ని అవార్డులు వచ్చాయి? ఏయే పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు? అనేది చూడండి. 


చిరంజీవి 'స్వయంకృషి'కి తొలి అవార్డు
చిరంజీవి సినిమా నేపథ్యం నుంచి వచ్చిన కథానాయకుడు కాదు... స్వయంకృషి, స్వశక్తితో ఎదిగిన హీరో. పరిశ్రమలోకి రావాలని కలలు కంటున్న కోట్లాది మందికి స్ఫూర్తి ఇచ్చిన అందరివాడు. ఆయన 'స్వయంకృషి'కి మొట్టమొదటి ప్రభుత్వ అవార్డు రావడం విశేషం. 


'స్వయంకృషి' సినిమాకు గాను 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా చిరంజీవి నంది అందుకున్నారు. ఆయనకు తొలి ప్రభుత్వ పురస్కారం ఇది. అంతకు ముందు 'శుభలేఖ' (1982), 'విజేత' (1985)లో రెండు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చారు. మొత్తం మీద 9 ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ తీసుకున్నారు చిరు.


'ఆపద్బాంధవుడు' సినిమాకు గాను 1992లో మరోసారి, 'ఇంద్ర' సినిమాకు గాను 2022లో ఇంకోసారి నంది ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు మెగాస్టార్. మొత్తం మీద ఆయన ఖాతాలో మూడు నందులు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ 2006లో గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించగా... 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.


పద్మశ్రీ లేదు... నేరుగా పద్మభూషణ్
భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఆ తర్వాత స్థానాల్లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ ఉంటాయి. సినిమా ప్రముఖులు కొందరికి తొలుత పద్మ శ్రీ అవార్డు వరించిన తర్వాత పద్మభూషణ్ వచ్చింది. అయితే, చిరంజీవికి పద్మశ్రీ రాలేదు. ఆయనను 2006లో పద్మభూషణ్ లభించింది. ఈ ఏడాది పద్మ విభూషణ్ వరించింది.


ఆస్కార్ అకాడమీ నుంచి అవార్డుల వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ చిరంజీవి. మెగాస్టార్ 1987లో 59వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరు అయ్యారు.


Also Readచిరంజీవికి ముందు పద్మ విభూషణ్ అందుకున్న హీరోలు ఎవరు... ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరెవరికి ఆ అవార్డు వచ్చిందో తెలుసా?
 
Chiranjeevi awards list: రెండేళ్ల క్రితం... 2022లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) చిరంజీవిని సన్మానించింది. ప్రయివేట్ సంస్థలు ఇచ్చిన అవార్డులు కోకొల్లలు. 


చిరంజీవిని కేవలం నటుడిగా మాత్రమే ప్రభుత్వాలు చూడలేదు. ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ స్థాపించడం ద్వారా ఆయన చేసిన సేవను గుర్తించాయి. అందుకు పద్మ భూషణ్ వచ్చింది. కోవిడ్ కాలంలో 'కరోనా క్రైసిస్ ఛారిటీ' నెలకొల్పి చిత్ర పరిశ్రమ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు చిరంజీవి. ఇంకా అత్యవసర పరిస్థితులలో ఆక్సీజెన్ లభించక ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఆక్సీజెన్ సిలిండర్లు, అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు పద్మ విభూషణ్ వచ్చింది.


Also Readమెగా ప్రిన్సెస్ క్లీంకార అమ్మమ్మ ఇంట్లో ఒకరు, నానమ్మ ఇంట్లో మరొకరు - ఊహ తెలిసే వయసుకు ఇంకెన్నో?