Actor Ashwath Bhatt Assaulted By Robber In Istanbul: ‘రాజీ’, ‘సీతారామం’, ‘హైదర్’, ‘మిషన్ మజ్ను’ లాంటి సినిమాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్న యాక్టర్ అశ్వత్ భట్ కు టర్కీలో ఊహించని ఘటన ఎదురైంది. వెకేషన్ లో భాగంగా ఆయన ప్రస్తుతం ఇస్తాంబుల్ లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ఆగష్టు 4 నాడు ఇస్తాంబుల్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గలాటా టవర్ ను చూడాలనుకున్నారు. తను బస చేసిన హోటల్ నుంచి అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్తుండగా, ఊహించని పరిణామం ఎదురైంది. గలాటా టవర్‌కు కొద్ది దూరంలో ఆయనపై దొంగలు దాడి చేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన ఓ జాతీయ చానెల్ తో పంచుకున్నారు.
ఇంతకీ గలాటా టవర్ ముందు ఏం జరిగిందంటే?
గలాటా టవర్ ముందు తనపై దొంగలు దాడి చేసి, బ్యాగ్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించారని అశ్వత్ భట్ చెప్పారు. “నేను గలాటా టవర్ వైపు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతని చేతిలో గొలుసు ఉంది. నేను అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక ముందే, అతడు నన్ను వీపు మీద కొట్టాడు. నేను తేరుకోక ముందే, నా బ్యాగ్ ని లాక్కెల్లేందుకు ప్రయత్నించాడు. దూరంగా ఓ దొంగల ముఠా ఉన్నట్లు అర్థం అయ్యింది. కానీ, వాళ్లు నా దగ్గరికి రాలేదు. ఒక్కడే నా బ్యాగ్ తీసుకెళ్లేందుకు ట్రై చేశాడు. ఇంతలోనే అక్కడిని ఓ క్యాబ్ డ్రైవర్ వచ్చాడు. అతడిని చూసి దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. క్యాబ్ డ్రైవర్ నా గాయం కావడాన్ని గమనించాడు. వెంటనే నన్ను పోలీసుల దగ్గరికి వెళ్లమని చెప్పాడు” అని వివరించాడు.
పర్యాటక ప్రాంతంలో ఇలా జరగడం దురదృష్టకరం- అశ్వత్ భట్
టర్కీలో జేబు దొంగలు ఉంటారని విన్నానని, పర్యాటక ప్రాంతంలో ఇలా జరుగుతుందని ఊహించలేదని అశ్వత్ భట్ చెప్పారు. “టర్కీలో జేబు దొంగలు ఉంటారని విన్నాను. కానీ, నాకే ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ముఖ్యంగా ఇలాంటి పర్యాటక ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. టర్కీలో చాలా మంది రొమాంటిక్ గా ఉంటారని విన్నాను. కానీ, ఇలా జరగడంతో షాకయ్యాను. నేను మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్ తో పాటు ఐరోపాలోని చాలా ప్రాంతాలకు వెళ్ళాను. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ, టర్కీలో జీవితంలో మర్చిపోలేని ఘటన జరిగింది” అని అశ్వత్ భట్ తెలిపారు.
సంఘటన జరిగిన తర్వాత తాను పోలీస్ పెట్రోలింగ్ కారు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పినట్లు అశ్వత్ భట్ తెలిపారు. ఈ విషయంపై కంప్లైంట్ ఇవ్వాలని కోరారని చెప్పారు. అయితే, ఇంతకీ తను ఫిర్యాదు ఇచ్చారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Read Also: 'దసరా' నటుడికి అరుదైన వ్యాధి - ADHDతో బాధపడుతున్న షైన్ టామ్ చాకో, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే!
Also Read: పవన్ కళ్యాణ్-రవితేజతో మల్టీస్టారర్ - క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన హరీశ్ శంకర్