సిన్నోడా...
ఓ సిన్నోడా!
సిన్న సిన్న మేడ!
సిత్తరంగా సూపిస్తాది...
సంబరాల జాడ! 


ఎగిరి దూకితే...
అంబరమందదా!
ఇంతకు మించిన సంబరముంటడా!
ఎన్నడు చూడని ఆనందములోన...
రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా!
అంతే లేని సంతోషాలు మన సొంతం అయ్యేనా!


- ప్రముఖ గాయని మంగ్లీ (Singer Mangli) పాడిన కొత్త పాటలో లైన్లు ఇవి! ఈ పాటను రాసింది చరణ్ అర్జున్ (Music Director Chaan Arjun). పాట రాయడమే కాదు... దానికి సంగీతం కూడా అందించారు. ఇంతకీ, ఈ పాట ఏ సినిమాలోనిదో చెప్పలేదు కదూ!  


సముద్రఖని, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, మీరా జాస్మిన్ (Meera Jasmine), తమిళ నటుడు మొట్ట రాజేంద్ర‌న్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విమానం' (Vimanam Movie). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో తొలి పాట 'రేలా రేలా...' (Rela Rela Song)ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలో సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ తండ్రి కుమారులుగా నటిస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించే గీతమే 'రేలా రేలా'. 


'నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు...
అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు!
దశరథ మహారాజే నాన్నై పుట్టాడు...
నువ్వు రాముడంత ఎదగర నేడు'


అంటూ చరణ్ అర్జున్ రాసిన సాహిత్యం కథలో ఆత్మను చక్కగా ఆవిష్కరించింది. విమానం ఎక్కాలని కుమారుడు కల కంటాడు. దానిని వికలాంగుడైన తండ్రి ఎలా సాకారం చేశాడనేది కథ. 


జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో 'విమానం'
జూన్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుందని, పాటకు కూడా మంచి స్పందన లభిస్తోందని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.


Also Read : నేను ఆత్మహత్య చేసుకుంటే కారణం వీళ్ళే, నన్ను చంపేందుకూ ప్రయత్నించారు - లిరిసిస్ట్ శ్రేష్ఠ షాకింగ్ పోస్ట్



''జీవితంలో ఏదో సాధించాల‌ని మ‌న‌కు చెప్పే పాత్ర‌ల‌ను వెండితెర‌పై చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి పాత్రల‌తో రూపొందిన చిత్ర‌మే ఈ 'విమానం'. తండ్రి కుమారుల అనుబంధంతో పాటు ఎన్నో మంచి అంశాలు మా సినిమాలో ఉన్నాయి'' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో అనసూయ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందట. ప్రోమోకు లభిస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.


జీ స్టూడియోస్‌ సౌత్ మూవీస్ హెడ్ అక్ష‌య్ క్రేజీవాల్ మాట్లాడుతూ ''కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్‌ సంస్థతో కలిసి ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. భావోద్వేగాల క‌ల‌బోత‌గా బ‌ల‌మైన క‌థాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రేక్ష‌కులు న‌చ్చే కథలు, సినిమాలను అందించ‌ట‌మే మా ల‌క్ష్యం. ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నాం'' అని చెప్పారు.


Also Read ఉత్తమ రౌడీ కాదు, ఉత్తమ వెన్నుపోటు దారుడు, గురికాడు అవార్డులు ఇవ్వాలి... అశ్వినీదత్ వ్యాఖ్యలపై పోసాని కౌంటర్ ఎటాక్



ఈ చిత్రానికి కళ :  జె.జె. మూర్తి, కూర్పు :  మార్తాండ్ కె. వెంక‌టేష్‌, మాటలు :  హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం), పాటలు : స్నేహ‌న్‌ (తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు), ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, సంగీతం : చ‌ర‌ణ్ అర్జున్‌, నిర్మాతలు :  జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌), ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  శివ ప్ర‌సాద్ యానాల‌.