టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్స్ లలో గుణశేఖర్, ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గత కొన్నేళ్ళుగా సినీ అభిమానులను అలరిస్తున్న ఈ ఇద్దరు దర్శక దిగ్గజాలలో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఇద్దరూ ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తుంటారు. భారీ సెట్లకు ప్రసిద్ది చెందారు. వెండి తెర కోసం శిల్పాలు చెక్కే క్రమంలో, ఒక్కో సినిమాకి ఏళ్ల తరబడి సమయం తీసుకుంటారు. విజువల్ వండర్స్ ని క్రియేట్ చేయడానికి, ఆడియన్స్ ను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.
మామూలుగా ఐతే ఏదైనా సినిమా తెరమీదికి రావడానికి ఆలస్యం అవుతూ ఉంటే.. ప్రేక్షకులు దాని గురించి మర్చిపోతారు లేదా ఆ సినిమాపై అంచనాలైనా తగ్గించుకుంటారు. కానీ రాజమౌళి, గుణశేఖర్ సినిమాల విషయంలో మాత్రం అది నిజం కాదు. వారు తమ కొత్త ప్రాజెక్ట్స్ ని ప్రకటించిన తరువాత, అది విడుదల కావడానికి ఎంత సమయం పట్టినా సరే సినీ అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉంటారు. రోజు రోజుకీ ఆ సినిమాపై అంచనాలు పెంచుకుంటూనే పోతుంటారు.
గుణశేఖర్, రాజమౌళి ఇద్దరూ భారీ సెట్లు, అత్యధిక బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. కాకపొతే సక్సెస్ రేట్ విషయంలో మాత్రం వీరివురి మధ్య చాలా తేడా ఉంది. ఇందులో జక్కన్న పైచేయి సాధిస్తే.. గుణశేఖర్ వెనుకబడిపోయారు. రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్స్ తో, సరికొత్త బాక్సాఫీసు రికార్డులతో, అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతుంటే.. గుణశేఖర్ మాత్రం తన స్థాయికి తగ్గ సక్సెస్ అందుకోవడంలో విఫలం అవుతున్నారు.
కమర్షియల్ సినిమాలతో పాటుగా పౌరాణిక, చారిత్రక నేపథ్యం గల చిత్రాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు గుణశేఖర్. బాల నటీనటులతో 'రామాయణం' ఇతిహాసాన్ని తెర మీదకి తీసుకొచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. 'మనోహరం', 'చూడాలని ఉంది', 'ఒక్కడు' లాంటి సినిమాలతో ఇండస్ట్రీ అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు.
ఇక రాజమౌళి 'బాహుబలి' సినిమా సంచలనం సృష్టించిన తర్వాత, గుణశేఖర్ సైతం తెలుగు తెరపై చరిత్ర సృష్టించాలని 'రుద్రమదేవి' చిత్రం చేశాడు. అందుకోసం కాకతీయుల చరిత్రను తిరగదోడి, మూడేళ్లపాటు తీవ్రంగా శ్రమించి సినిమాగా మలిచారు. కళ్లు మిరుమిట్లు గొలిపే సెట్లు, అబ్బురపరిచే ఫైట్లతో ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఫస్ట్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డీ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోయింది. జస్ట్ పాస్ మార్కులతో బయటపడింది.
భారీ సినిమా అంటే కేవలం బడ్జెట్ మాత్రమే కాదు.. ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. రాజమౌళి వాటిని అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు. తనదైన మార్క్ యాక్షన్, ఎమోషన్స్ తో అందరినీ మెప్పించాడు.. వరుస విజయాలు సాధిస్తున్నాడు. కానీ ఆ విషయంలో మాత్రం గుణశేఖర్ ఫెయిల్ అయ్యాడు. చరిత్రను తెర మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు కానీ.. ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయి చూసేంత ఎంగేజింగ్ గా సినిమా చూపించలేకపోయారు. ఎమోషనల్ గా ప్రేక్షకుడిని సినిమాతో కనెక్ట్ చేయలేకపోయాడు. అందుకే ఆశించిన స్థాయిలో సినిమా హిట్ అవ్వలేదు.
అయితే దాదాపు ఏనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత గుణశేఖర్ ఇప్పుడు 'శాకుంతలం' వంటి మరో విమెన్ సెంట్రిక్ మైథలాజికల్ డ్రామాతో మన ముందుకి వస్తున్నారు. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమంత రూత్ ప్రభు టైటిల్ రోల్ లో భారీ బడ్జెట్ తో 3డీలో తీశారు. దీని నిర్మాణంలో గుణ శేఖర్ తో పాటుగా దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ జత చేరారు. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా ఐదు ప్రధాన భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరి ఇది గుణశేఖర్ కు ఎలాంటి అనుభవాన్ని మిగుల్చుతుందో వేచి చూడాలి.