బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పాటలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం విశేషం. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా సినిమా ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. 


'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ట్రైలర్ చూస్తుంటే.. ఇది లవ్, కామెడీ, యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన సినిమా అని తెలుస్తోంది. 'నీ పేరేంటి?' అని అడగ్గా.. 'నాకు పేరు లేదు.. అందరూ నన్ను భాయిజాన్ అని పిలుస్తారు' అని సల్మాన్ ఖాన్ చెబుతాడు. అయితే సల్మాన్ ఇష్టపడే పూజాహెగ్డే మాత్రం భాయ్ జాన్ అని పిలవడానికి ఇబ్బంది పడుతోంది. అందుకే అతన్ని జాన్ అని పిలుస్తుంది.


ట్రైలర్ లో ఓ సీన్ లో పూజ చేతిలోని పింగాణీ బొమ్మ సల్మాన్ చేయితగిలి పడిపోయి పగిలిపోతుంది. 'అది 400 ఏళ్ళ క్రితం నాటిది' అంటూ పూజా పడుతుండగా.. 'ఓ అవునా.. నేను ఇంకా కొత్తదేమో అనుకున్నాను' అంటూ సల్మాన్ కూల్ గా చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. దీంట్లో సల్మాన్ - పూజా హెగ్డేల మధ్య లవ్ ట్రాక్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తోంది. 


విలక్షణ నటుడు జగపతిబాబును మోస్ట్ వైలెంట్ విలన్ గా పరిచయం చేయగా.. వైలెన్స్ అంటే భయపడే దక్షిణాది వ్యక్తిగా వెంకటేష్ ను చూపించారు. వెంకీ - భూమికలు ఇందులో పూజాకు అన్నా వదినలుగా కనిపించారు. పూజా ప్రేమలో పడిన సల్మాన్.. ఆమె కోసం వెంకీ ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వెంకటేష్ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలిచి, విలన్ల భరతం పడుతున్నట్లు అర్థమవుతోంది. చూస్తుంటే.. బాలీవుడ్, టాలీవుడ్‌ను మిక్సిలో వేస్తే వచ్చే రిజల్టే ఈ మూవీ అన్నట్లుగా ఉంది.


మొత్తం మీద అన్ని ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు ట్రైలర్ లోనే కథేంటి అనేది చెప్పే ప్రయత్నం చేశారు. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' అనేది తమిళ్ 'వీరమ్' చిత్రానికి రీమేక్ ( తెలుగులో 'కాటమ రాయుడు') అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ డిఫెరెంట్ గెటప్స్ తో మెప్పించాడు. అలానే తన నుంచి ఫ్యాన్స్ ఆశించే ఫైట్స్ చాలా ఉన్నట్లు శాంపిల్ గా చూపించారు. 'ఇది పవర్ కాదు.. విల్ పవర్' వంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.



ఇప్పటికే 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. తెలంగాణ నేపథ్యంలో 'బతుకమ్మ' సాంగ్.. రామ్ చరణ్, వెంకీ, సల్మాన్ కలిసి చేసిన 'ఏంటమ్మా' సాంగ్ సౌత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ కూడా సినీ అభిమానులను ఉత్సాహ పరుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 21న రంజాన్ కానుకగా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా సల్మాన్ ఖాన్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.