యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కస్టడీ'. కోలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో చైతూ తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. అంతేకాదు 'సాహసం శ్వాసగా సాగిపో' తర్వాత ఖాకీలో కనిపించబోతున్నారు. కాకపోతే ఈసారి చై ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే 'వేట మొదలైంది' అంటూ వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
'కస్టడీ' సినిమా నుంచి 'హెడ్ అప్ హై' అనే సాంగ్ ని తెలుగు తమిళ భాషల్లో ఈరోజు సోమవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా మేకర్స్ విడుదల చేశారు. 'సేఫ్టీ సెక్యూరిటీకి సింబల్ ఈ ఖాకీరా.. మఫ్టీలో ఉన్నా కానీ పవరే పటాకీరా.. డ్యూటీలో రౌండ్ ది క్లాక్ ఫుల్ టూ చలాకీరా.. ఈ లాఠీతో జర్నీ చేసే లైఫ్ ఎంతో లక్కీరా' అంటూ సాగిన ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. నాగచైతన్య తన బ్యాచ్ మేట్ తో కలిసి హుషారుగా ఎంజాయ్ చేసే సందర్భంలో చిత్రీకరించారు. 'కంటి నిద్రళ్ళు మాని కావలుంటాం.. రక్షించే కర్తవ్యం మాదంటా..' అంటూ పోలీసుల స్పిరిట్ ను ఈ ఎనర్జిటిక్ సాంగ్ ద్వారా తెలియజెప్పారు.
''హెడ్ అప్ హై'' సాంగ్ కి మ్యాస్ట్రో ఇళయరాజా ట్యూన్ కంపోజ్ చేశారు. లిటిల్ మ్యాస్ట్రో యువ శంకర్ రాజా, అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్ కలిసి ఈ పాట పాడారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కు క్యాచీ లిరిక్స్ రాయగా.. శివానీ వీపీ ఇంగ్లీష్ లిరిక్స్ రాసారు. డ్యాన్స్ మాస్టర్ జానీ దీనికి కొరియోగ్రఫీ చేశాడు. చైతూ బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకొని సింపుల్ స్టెప్స్ కంపోజ్ చేసినట్లు లిరికల్ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఎస్ ఆర్ కతీర్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాజీవన్ ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. సత్య నారాయణ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
వెంకట్ ప్రభు తనదైన మార్క్ యాక్షన్ తో బలమైన కథతో 'కస్టడీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగచైతన్యను కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో విలక్షణ నటుడు అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించారు. శరత్ కుమార్, ప్రియమణి, ప్రేమి విశ్వనాధ్ (వంటలక్క), సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమ్ జీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
'కస్టడీ' చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 12న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది 'థాంక్యూ' చిత్రంతో నిరాశ పరిచిన చైతన్య.. ఈసారి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.