టాలీవుడ్ స్టార్ దర్శకుడు తెరకెక్కించిన సినిమా ‘శాకుంతలం’. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషించింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నీలిమ గుణ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 14 న తెలుగు, హిందీ,తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల అయిన మూవీ టీజర్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా తిరుగుతోంది. దర్శకుడు గుణశేఖర్ సినిమా ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు గుణశేఖర్, నటి సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 


నటి సమంత మాట్లాడుతూ.. ‘శాకుంతలం’ కథ విన్నప్పుడు తనకు కొంత మేర మాత్రమే తెలుసని, కానీ ఇది ప్రస్తుత మోడ్రన్ అమ్మాయిలకు అర్థమయ్యే కథ అని చెప్పింది. మొదట్లో తాను ఈ పాత్ర చేయడానికి భయపడ్డానని, కానీ చేసిన తర్వాత పాత్రకు న్యాయం చేశానని అనుకుంటున్నానని అంది. తన నటన పట్ల దర్శక నిర్మాతలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపింది.  శాకుంతల చాలా ప్రత్యేకమైనదని, ఆ పాత్ర ప్రస్తుత సమాజ పరిస్థితులకు అద్దం పడుతుందని, కాబట్టి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పింది. తాను కూడా సమస్యలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండటం నేర్చుకున్నానని, అది అందరికీ జరుగుతుందని పేర్కొంది. 






ఇక శకుంతల పాత్ర కోసం తాను ఎలాంటి రిఫరెన్స్ లను తీసుకోలేదని చెప్పింది సమంత. దర్శకుడు తనకు కథ చెప్పినప్పుడు ఏ మైథిలాజికల్ ఫిల్మ్ లు చూడొద్దని చెప్పారని, ఎందుకంటే శకుంతల పాత్ర గురించి తనకు ఓ క్లారిటీ ఉందని, తాను కూడా డైరెక్టర్నే ఫాలో అయిపోయానని తెలిపింది. అందుకే సినిమా చాలా బాగా వచ్చిందని పేర్కొంది. ఈ సినిమా ట్రైలర్ ను త్రిడిలో చూసిన తర్వాత షాక్ అయ్యానని, అంతబాగా అవుట్ పుట్ వచ్చిందని అంది. ఇక సినిమాలో అల్లు అర్హ కూడా బాగా చేసిందని, ఆమె కనపించిన ప్రతీ సన్నివేశం ప్రేక్షకుల పెదవుల పై చిరునవ్వు తెప్పిస్తుందని తెలిపింది. అనంతరం ఇండస్ట్రీలో స్టార్ గా రానించడం పట్ల సమంత మాట్లాడుతూ.. తాను స్టార్ హీరోయిన్ గా మారే క్రమంలో తనకు ఇండస్ట్రీ చాలా సపోర్ట్ ఇచ్చిందని చెప్పింది. మనం సెట్స్ లోకి వెళ్లకపోతే ముందుగా ఇబ్బంది పడేది నిర్మాతలేనని, అయితే తనకు ఆరోగ్యం బాలేనపుడు తనను ఏ నిర్మాత ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చింది. పూర్తిగా తగ్గిన తర్వాతే షూటింగ్ కు రమ్మన్నారని తెలిపింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో మోహన్ బాబు, దేవ్ మోహన్, గౌతమి, అనన్య నాగళ్ల తదితరులు నటించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. 



Also Read:  ఇలాంటి పనులు చేస్తే నవగ్రహాల ఆగ్రహానికి గురికాతప్పదు!