Tamil star Silambarasan TR donate for flood relief in Telugu States: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాలను వరదలు అతలాకుతలం చేశాయి. విజయవాడ, ఖమ్మం తదితర ప్రాంతాలను బుడమేరు వాగు ముంచేసింది. దీంతో విజయవాడలోని సింగ్ నగర్, తెలంగాణలోని ఖమ్మం తదితర ప్రాంతాల్లో ప్రజల ఇళ్లలోకి నీళ్లు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో వాళ్లను ఆదుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇక వరద బాధితుల కోసం చాలామంది తమ ఆపన్న హస్తం అందిస్తున్నారు. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళాలు అందజేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే ఎంతోమంది తెలుగు నటులు సాయం అందించగా.. ఇప్పుడిక తమిళ హీరో శింబు కూడా తన పెద్ద మనసు చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
ఎంత ఇచ్చారంటే?
సిలంబరసన్ థెసింగు రాజేంద్ర ఈయన్నే శింబు అని పిలుస్తారు. తమిళ హీరో అయినప్పటీకీ తెలుగు వాళ్లకి కూడా ఆయన సుపరిచితమే. ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక తనను అభిమానించే తెలుగు ప్రజల కోసం ఆయన తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. రూ. 6 లక్షలు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు సాయం చేసిన మొదటి తమిళ్ హీరోగా నిలిచారు శింబు.
నటన విషయానికి వస్తే... శింబు ఇటీవల సినిమాలు చాలా తగ్గించేశారు. కేవలం ఏడాదికి ఒకటి సినిమా మాత్రమే చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న 'థగ్ లైఫ్' సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' లో కూడా శింబు నటిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాలో ఆయన విలన్ పాత్ర పోషిస్తున్నారని ఫిలిమ్ నగర్ లో టాక్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే విరాళాలు ప్రకటించిన హీరోలు..
టాలీవుడ్ కి చెందిన చాలామంది నటీనటులు తమవంతుగా విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, అనన్య నాగెళ్ల ఇలా చాలామంది ఇప్పటికే రిలీఫ్ ఫండ్స్ ప్రకటించారు. ఇప్పుడే కాదు.. కేరళలోని వయనాడ్ లో వరదలు వచ్చినప్పుడు కూడా మన హీరోలు స్పందించారు తమవంతుగా సాయాన్ని ప్రకటించారు. కేరళ రిలీఫ్ ఫండ్ కి కోట్ల రూపాయల డొనేషన్స్ ఇచ్చి తమ పెద్ద మనసు చాటుకున్నారు మన హీరోలు. కాగా.. వరదల్లో చిక్కుకున్న ఆయా ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ప్రభుత్వం వాళ్లకు కావాల్సిన అవసరాలను తీర్చేందుకు సహాయక చర్యలు చేపడుతోంది. తమకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తోంది.
Also Read: రిలీజుకు ముందే 'దేవర' రికార్డుల మోత... అమెరికాలో ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఇదే