Shekhar Mastar : ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. చివరి చూపు కోసం తరలి వస్తున్నారు. ఈ క్రమంలో రాకేష్ మాస్టర్ శిష్యుడైన శేఖర్ మాస్టర్ ఆయన మరణ వార్త విని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం రాకేష్ మాస్టర్ ఇంటికి వెళ్ళి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 


గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న రాకేష్ మాస్టర్.. ఇటీవలే రక్త విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆయన పరిస్తితి విషమించడంతో.. జూన్ 18న సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రేక్షకులు, రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సినీ ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఇంకొందరు మాత్రం నేరుగా రాకేష్ మాస్టర్ ఇంటికి వెళ్ళి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన శిష్యుడైన శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ ఇంటికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. ఈ పరిస్థితిలో రాకేష్ మాస్టర్ ను చూసిన ఆయన.. బోరున విలపించారు. శేఖర్ మాస్టర్ కన్నీరు పెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. జానీ మాస్టర్ పైతం రాకేష్ మాస్టర్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.


కొన్ని రోజులుగా రాకేష్ మాస్టర్ కు, శేఖర్ మాస్టర్ కు పలు విభేదాలున్న విషయం తెలిసిందే. ఇంతకీ వారిద్దరి మధ్య గొడవలకు కారణాలేంటీ..  అన్న విషయం ఇప్పుడు మరో సారి హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు అప్పట్లో రాకేష్ మాస్టర్ "నేను చనిపోతే నా శవాన్ని కూడా తాకనివ్వద్దు" అన్న మాటలు కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. 


విభేదాలకు అసలు కారణం ఏంటంటే..


గతంలో రాకేష్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ తో తనకున్న విభేదాల గురించి చెప్పుకొచ్చారు. తను కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు తన శిష్యులు అంతా తన వద్దే ఉండేవారని చెప్పారు. అలా శేఖర్ కూడా తన వద్దే ఉండేవాడని అయితే తనకు పెళ్లి తర్వాత అది తన భార్యకు నచ్చేది కాదని రోజూ గొడవలు అయ్యేవని చెప్పారు. దీంతో ఆమె గొడవపడి వెళ్లిపోయిందని అన్నారు. శేఖర్ కు పెళ్లి కూడా తానే చేశానని అన్నారు. కానీ ఓ ఇంటర్వ్యూలో శేఖర్ తన గురించి తక్కువ చేసి మాట్లాడాడని, తన గురువు ప్రభుదేవా అని చెప్పడం తనకు ఎంతో బాధకలిగించిందన్నారు. కన్నబిడ్డలా చూసి పెళ్లి చేస్తే తర్వాత తనను పక్కన పెట్టాడని వాపోయారు. కనీసం శేఖర్ కూతురి పుట్టిన రోజు కి కూడా తనకు చెప్పలేదని, బాధేసి ఫోన్ చేస్తే వాళ్ల ఆవిడ ఫోన్ ఎత్తి ‘ఏంటీ నీకు అన్నీ చెప్పాలా’ అని అందని అన్నారు. ఆ శేఖర్ ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అని, తను చనిపోతే వాడు తన శవాన్ని కూడా తాకడానికి వీల్లేదని అన్నారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.


Read Also : ఓం రౌత్, మనోజ్‌లను చంపేస్తాం, ముంబైలోనే లేపేస్తాం - ‘ఆదిపురుష్’ డైలాగ్స్‌పై క్షత్రియకర్ని సేన ఆగ్రహం