బాలీవుడ్ దర్శకుడు ఓమ్రావ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్' జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మిశ్రమ స్పందన కనబరిచిన సంగతి తెలిసిందే. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్షన్ 3d టెక్నాలజీతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఒకింత నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక సినిమా టాక్ గురించి పక్కన పెడితే సినిమా విడుదలైనప్పుడు నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఈ సినిమాలో శ్రీరాముడు, సీత, హనుమంతుడు, రావణుని చూపించిన తీరుపై సినిమాలోని డైలాగులపై తీవ్రమైన విమర్శలు రావడం జరిగింది. దాంతో పలుచోట్ల నుంచి ఈ సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ కూడా వినిపించింది.


ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆదిపురుష్ సినిమా యూనిట్ పై క్షత్రియ కర్ణి సేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదిపురుష్ సినిమాలో వివాదాస్పద డైలాగులు ఉండడం, రాముడు, సీత, హనుమంతుడు, రావణుడి పాత్రలపై తీవ్ర అభ్యంతరాల వ్యక్తం చేయడమే కాకుండా తాజాగా మధ్యప్రదేశ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్షత్రియ కర్ణిసేన చిత్ర దర్శకుడు ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్‌ని చంపేస్తామని బెదిరించింది. క్షత్రియకర్ని సేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ షేకావత్ మధ్యప్రదేశ్ రాజ్ గఢ్ లోని బియోరాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "ఆదిపురుష్ డైరెక్టర్ ని చంపడానికి ముంబైలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఆయుధాలతో ముంబై అంత వెతికి పట్టుకొని చంపేయమని చెబుతాం" అంటూ తాజా ప్రెస్ మీట్ లో రాజ్ షేకవత్ పేర్కొన్నారు. ఇక మరో నేత ఇందళ్ సింగ్ రానా సినిమాలోడైలాగ్ రైటర్ మనోజ్ ముంతాసిర్ ని అతను రాసిన ఓ డైలాగ్ ని అనుసరిస్తూ చంపేస్తాం అంటూ బెదిరించాడు. కాగా ఇప్పటికే 'ఆదిపురుష్' మూవీ లోని కొన్ని డైలాగ్స్ పై విమర్శకుల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.






ఇందులో భాగంగానే హిందూ సంఘాలు బిజెపి కాంగ్రెస్ నేతలు సైతం ఆదిపురుష్ సినిమాలోని సంభాషణలు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ లోని డైలాగ్స్ ని మార్చడానికి మూవీ యూనిట్ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ..' ప్రేక్షకుల మనోభావాలు వారి సెంటిమెంట్స్ వారి సూచనలను గౌరవించి 'ఆదిపురుష్' సినిమాలోని కొన్ని డైలాగ్స్ ని మార్చబోతున్నాం. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో ఆదిపురుష్ సినిమాను చూడవచ్చు' అంటూ ప్రకటనలో భాగంగా పేర్కొన్నారు నిర్మాతలు.


ఇక ఆదిపురుష్ మూవీకి ఎన్ని వివాదాలు, విమర్శలు తలెత్తుతున్న కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మొదటిరోజు ఆదిపురుష్ మూవీ ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ ని ప్రపంచవ్యాప్తంగా అందుకుంది. ఇక రెండో రోజుకి కలెక్షన్స్ మరింత పెరిగాయి. రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి రూ.240 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ యూనిట్ అధికారికంగా పేర్కొంది. ఇక మూడో రోజు ఈ సినిమా మరో రూ.100 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. కాగా రెట్రో ఫైల్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని భూషణ్ కుమార్ నిర్మించగా, అజయ్ - అతుల్ స్వరాలు సమకూర్చారు.


Also Read: ‘ఆదిపురుష్’పై సర్వత్రా విమర్శలు, సినీ అభిమానులకు కోపం తెప్పించిన 10 మిస్టేక్స్ ఇవే!