తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో శేఖర్ చంద్ర (Sekhar Chandra) ఒకరు అని చెప్పుకోవాలి. సంగీత దర్శకుడిగా ఆయన ప్రతిభ చూపించిన చిత్రాలు చాలా ఉన్నాయి. అయితే... కారణాలు ఏమైనా కానీ ఆయనకు రావాల్సినంత పేరు రాలేదు. 'పని చెయ్! ఫలితం ఆశించకు' అనే రీతిలో శేఖర్ చంద్ర సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. మంచి మంచి పాటలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ... 'నిజమే నే చెబుతున్నా'.


సందీప్ కిషన్ 'భైరవ కోన'లో...
సందీప్ కిషన్ (Sundeep Kishan) కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా సినిమా 'ఊరు పేరు భైరవకోన' (Ooru Peru Bhairavakona Movie). ఈ చిత్రంలో వర్షా బొలమ్మ, కావ్యా థాపర్ కథానాయికలు. ఇంతకు ముందు సందీప్ కిషన్ హీరోగా 'టైగర్' వంటి హిట్ సినిమా తీసిన వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. 'డిస్కో రాజా' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 


'ఊరు పేరు భైరవకోన' సినిమాలో 'నిజమే నే చెబుతున్నా...' పాటను మూడు నెలల క్రితం విడుదల చేశారు. దీనిని సందీప్ కిషన్, వర్షా బొల్లమ్మ మీద తెరకెక్కించారు. శేఖర్ చంద్ర స్వరపరిచిన ఈ మెలోడీ శ్రోతలను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు యూట్యూబ్‌లో 30 మిలియన్స్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఈ మధ్య యంగ్ హీరోల సినిమాల్లో ఈ స్థాయిలో విజయం సాధించిన సాంగ్ మరొకటి లేదని చెప్పవచ్చు. ఇన్స్టాలో ఈ సాంగ్ రీల్స్ చాలా మంది చేశారు. ఇప్పుడు ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. 'నిజమే నే చెబుతున్నా...' (Nijame Ne Chebutunna Lyrical) పాటకు యువ గేయ రచయిత శ్రీమణి సాహిత్యం అందించగా... స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాడారు.



శేఖర్ చంద్ర... సిద్ శ్రీరామ్...
సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్!
శేఖర్ చంద్ర, సిద్ శ్రీరామ్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. శేఖర్ చంద్ర సంగీతంలో సిద్ శ్రీరామ్ పాడిన 'బాగుంటుంది నువ్వు నవ్వితే...' (అతిథి దేవో భవ సినిమాలో), 'ప్రియతమా ప్రియతమా...' (కొత్త కొత్తగా సినిమాలో), 'మనసు దారి తప్పేనే...' (షికారు సినిమాలో) పాటలు ఆయా చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం 'నిజమే నే చెబుతున్నా' పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 


ఆ ఇద్దరికీ స్పెషల్ థాంక్స్ - శేఖర్ చంద్ర
'నిజమే నే చెబుతున్నా...' పాటకు అద్భుతమైన ఆదరణ లభిస్తోన్న సందర్భంగా శేఖర్ చంద్ర మాట్లాడుతూ "ఈ పాట ఇంత విజయం సాధించడం చాలా హ్యాపీగా ఉంది. పాటను తమ సొంతం చేసుకున్న ప్రేక్షకులకు, సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్. పాట విడుదలైన తర్వాత చాలా మంది నాకు సందేశాలు పంపించారు. ఇంకా ప్రేక్షకుల నుంచి మెస్సేజెస్ వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా మా దర్శకుడు వీఐ ఆనంద్ గారి, హీరో సందీప్ కిషన్ గారికి, నిర్మాతలకు థాంక్స్. మా దర్శకుడితో నాకు ఇది రెండో సినిమా. మా కాంబోలో ఇంకా మరిన్ని సినిమాలు, మరిన్ని మంచి పాటలు వస్తాయి. 'నిజమే నే చెబుతున్నా' పాటను సిద్ శ్రీరామ్ పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. వాళ్ళిద్దరికీ థాంక్స్. సినిమా విడుదలైన తర్వాత ఈ పాట మరింత మందికి చెరువు అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. 


Also Read : రవితేజ సినిమాలో శర్వా బదులు విశ్వక్ సేన్ - విలన్‌గా మంచు మనోజ్?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial