మల్టీస్టారర్స్ చేయడానికి, మరో కథానాయకుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)కు అభ్యంతరం లేదు. కథ, అందులో తన పాత్ర నచ్చితే చాలు... సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా విశ్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే పాత్రలో రవితేజ నటించారు. నటుడిగా, హీరోగా ప్రయాణం ప్రారంభించిన కొత్తల్లో ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ మల్టీస్టారర్స్ మీద దృష్టి పెట్టారు. 


సందీప్ రాజ్ దర్శకత్వంలో రవితేజ
'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది మల్టీ హీరోస్ కథ. రవితేజతో పాటు మరో హీరోకి కూడా చోటు ఉంది. తొలుత ఆ పాత్రకు శర్వానంద్ (Sharwanand)ను అనుకున్నారు. అయితే, ఇప్పుడు శర్వా బదులు మరొక హీరో పేరు వినబడుతోంది. 


రవితేజతో పాటు విశ్వక్ సేన్ కూడా
శర్వానంద్ బదులు విశ్వక్ సేన్ (Vishwak Sen)ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మల్టీస్టారర్ చేయడానికి శర్వా కూడా సుముఖమే. 'మహాసముద్రం', దానికి ముందు కొన్ని చిత్రాలు చేశారు. మరి, ఈ సినిమా చేయడం ఆయనకు ఎందుకు కుదరలేదో మరి!  


లెక్చరర్ రవితేజ... స్టూడెంట్ విశ్వక్ సేన్?
సందీప్ రాజ్ సినిమాలో లెక్చరర్ పాత్రలో రవితేజ కనిపించనున్నట్లు తెలిసింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'మిరపకాయ్'లో మాస్ మహారాజాది పోలీస్ రోల్ అయినప్పటికీ... కొన్ని సన్నివేశాల్లో రవితేజ పాఠాలు చెబుతూ కనిపించారు. కథానుగుణంగా కాలేజీకి లెక్చరర్‌గా వెళతారు. 'మిరపకాయ్' తర్వాత మళ్ళీ రవితేజ లెక్చరర్ రోల్ చేయడం ఇదే.


రవితేజకు శిష్యుడిగా స్టూడెంట్ పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తారని సమాచారం. గురు శిష్యుల మధ్య బంధం కథలో కీలకమైన అంశం అట. వాళ్ళ రిలేషన్, ఎమోషన్, మనస్పర్థలు వంటివి హైలైట్ చేస్తూ సందీప్ రాజ్ కథ రాశారట.


ప్రతినాయకుడిగా మంచు మనోజ్?
మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే... ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్ చేయనున్నారట! కంప్లీట్ విలన్ రోల్ చేస్తారా? లేదంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తారా? అనేది చూడాలి.


Also Read : షారుఖ్ ముక్కుకు బ్యాండేజ్ - అమెరికాలో జరిగిన ప్రమాదం ఏమిటంటే?



జీ స్టూడియోస్ నిర్మాణంలో?
రవితేజ, విశ్వక్ సేన్, మంచు మనోజ్, సందీప్ రాజ్ కలయికలో సినిమాను జీ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. తొలుత రెండు మూడు నిర్మాణ సంస్థలు ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రొడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపించాయట. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా, భారీ ఎత్తున ఖర్చుకు రాజీ పడకుండా నిర్మించేలా జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. ఆ సంస్థతో పాటు మరొక ప్రొడక్షన్ హౌస్ చేరే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ & స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందని టాక్. త్వరలో సినిమా వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.


Also Read  'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ : తమన్నా బోల్డ్‌గా చేశారు సరే సిరీస్‌ ఎలా ఉంది? శృంగారం గురించి కొత్తగా ఏం చెప్పారు?


'కలర్ ఫోటో' సినిమా అవార్డులు అందుకోవడమే కాదు... దర్శకుడిగా సందీప్ రాజ్ (Sandeep Raj)కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహించబోయే సినిమా రవితేజ, శర్వాదే. మధ్యలో 'హెడ్స్ అండ్ టేల్స్', 'ముఖ చిత్రం' సినిమాలకు సందీప్ రాజ్ స్క్రిప్ట్స్ అందించారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial