యువ కథానాయకుడు శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారు జామున ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర అదుపు తప్పింది. ఇది స్వల్ప ఘటన అని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని హీరో ప్రతినిథులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న వారు అందరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.


శర్వానంద్ కారుకు పెద్ద ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన టీమ్ పేర్కొంది. కారుకు మాత్రం చిన్న గీత పడిందని, ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ అక్కడే ఉన్నారని, ఇది చాలా స్వల్ప సంఘటన అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది. దాంతో శర్వానంద్ అభిమానులు, ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.


పెళ్లి పనుల్లో శర్వానంద్ బిజీ!
ప్రస్తుతం శర్వానంద్ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. రక్షిత (Sharwanand fiance Rakshita)తో ఏడు అడుగులు వేయడానికి ఆయన రెడీ అయ్యారు. జూన్ 2, 3 తేదీల్లో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ (Leela Palace Jaipur)లోని లీలా ప్యాలెస్‌లో ఆయన పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సన్నిహితులకు ఆల్రెడీ శర్వానంద్ ఆహ్వానాలు అందజేశారని తెలిసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు యువి క్రియేషన్స్ అధినేతలతో ఒకరైన విక్రమ్, ఇంకా కొంత మంది పెళ్ళికి హాజరు కానున్నారు.  


Also Read : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?



 
జనవరిలో నిరాడంబరంగా నిశ్చితార్థం
మొన్నటి వరకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో శర్వానంద్ పేరు చాలా బలంగా వినిపించేది. 'అన్ స్టాపబుల్' షోలో నట సింహం నందమూరి బాలకృష్ణ 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్?' అని అడిగితే... ''ప్రభాస్ తర్వాత'' అని శర్వానంద్ సమాధానం ఇచ్చారు. విశేషం ఏమిటంటే... ప్రభాస్ కంటే ముందు శర్వా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.


శర్వా చేసుకోబోయే రక్షిత ఎవరు?
శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆమె తండ్రి పేరున్న లాయర్. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె ఈ రక్షిత అని తెలిసింది. అంతే కాదు... ఆమె మాజీ మంత్రి  బొజ్జల గోపాల కృష్ణ మనవరాలు కూడా!


వరుస సినిమాలతో బిజీ బిజీగా శర్వానంద్!
ఇప్పుడు శర్వానంద్ వరుస సినిమాలు చేస్తున్నారు. పెళ్ళికి ముందు ఆయన చేసిన 'ఒకే ఒక జీవితం' తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులను మెప్పించింది. విమర్శల నుంచి ప్రశంసలు అందుకుంది. మంచి వసూళ్లు రాబట్టింది. 


Also Read ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు - తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశాయ్!  


ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమాలో కృతి శెట్టి కథానాయిక. ఆ సినిమా కాకుండా సితార సంస్థలో కూడా ఓ సినిమా అంగీకరించారని తెలిసింది. సోలో హీరోగా కాకుండా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా శ్వరానంద్ సిద్ధంగా ఉన్నారు. రవితేజతో ఓ సినిమా చేయనున్నారని సమాచారం అందుతోంది.