2023 Bollywood Box Office: 2023 ఇయర్ ఎండింగ్ కి వచ్చేశాం. మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. గడిచిన ఏడాది కాలాన్ని రివైండ్ చేసి చూస్తే, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మిశ్రమ ఫలితాలు దక్కాయని చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే, కొన్ని చిత్రాలు మాత్రం వసూళ్ల వర్షం కురిపించాయి. కాకపోతే ఎన్నో ఏళ్లుగా సక్సెస్ లేని హీరోలు కొందరు ఈ సీజన్ లో ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా 90స్ లో హిందీ చిత్ర పరిశ్రమను ఏలిన స్టార్స్, డైరెక్టర్స్ ఈ ఏడాది స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ హిట్స్ తో కళ తప్పిపోయిన ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. 


షారుఖ్ ఖాన్:
2023 అనేది కింగ్ ఖాన్ షారుఖ్ నామ సంవత్సరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా సక్సెస్ రుచి చూడని బాలీవుడ్ బాద్ షా ఈ ఒక్క ఏడాదిలోనే మూడు హిట్లు సాధించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆయన నటించిన 'పఠాన్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత అట్లీ డైరెక్షన్ లో చేసిన 'జవాన్' మూవీ రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు అందుకున్న భారతీయ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో రెండు వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాలు కలిగిన మొట్ట మొదటి ఇండియన్ హీరోగా, ఒకే ఏడాదిలో రెండుసార్లు ఈ అరుదైన ఘనత సాధించిన హీరోగా, బ్యాక్ టు బ్యాక్ 2 ఆల్ టైమ్ గ్రాసర్స్ కలిగిన ఏకైక ఇండియన్ యాక్టర్ గా షారుక్ చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు 'డుంకీ' చిత్రంతో మరో హిట్టు కొట్టి హ్యాట్రిక్ విజయాలతో ఇయర్ ని ముగించాడు. రాజ్‌ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 5 రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది. ఇక సల్మాన్ ఖాన్‌  హీరోగా తెరకెక్కిన 'టైగర్ 3' సినిమాలో షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో అలరించారు. 


సన్నీ డియోల్:
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సన్నీ డియోల్ ఈ ఏడాది 65 ఏళ్ల వయసులో సాలిడ్ హిట్ కొట్టారు. 'గదర్ 2' సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇది 2001లో వచ్చిన 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' చిత్రానికి సీక్వెల్ గా రూపొందింది. అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా, డొమెస్టిక్ బాక్సాఫీస్ వద్ద ₹ 525 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలో 'బాహుబలి 2' రికార్డ్స్ ని బీట్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా 'జవాన్' 'పఠాన్' తర్వాతి స్థానాల్లో నిలిచింది. సన్నీ మాత్రమే కాదు, అతని తమ్ముడు బాబీ డియోల్ కూడా ఈ సంవత్సరంలో అతిపెద్ద సక్సెస్ రుచి చూశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన 'యానిమల్‌' మూవీలో కీ రోల్ ప్లే చేసారు. ఈ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ మూడు వారాల్లో వరల్డ్ వైడ్ గా ₹ 862 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.



కరణ్ జోహార్ & విధు వినోద్ చోప్రా:
2023లో కరణ్ జోహార్, విధు వినోద్ చోప్రా లాంటి ఇద్దరు ప్రముఖ బాలీవుడ్ దర్శకులు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. కరణ్ జో చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ సినిమా కూడా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రాల జాబితాలో చేరింది. ఇందులో రణవీర్‌ సింగ్, ఆలియా భట్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ₹ 355 కోట్లు కలెక్షన్స్ రాబట్టగలిగింది. మరోవైపు విధు వినోద్ చోప్రా '12త్ ఫెయిల్‌' లాంటి స్మాల్ బడ్జెట్ మూవీతో సక్సెస్ సాధించారు.  20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹ 65 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.