బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకుండా అశేష అభిమాన ఘనం ఆయన్ను ఆరాధిస్తుంటారు. ఐదేళ్లుగా బిగ్ స్క్రీన్ మీద కనిపించకపోయినా ఆయన ఫ్యాన్ డమ్ ఏమాత్రం తగ్గలేదని ఈ ఏడాదిలో వచ్చిన 'పఠాన్' 'జవాన్' చిత్రాలు నిరూపించాయి. కేవలం హిందీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కింగ్ ఖాన్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే వారిలో వెంటిలేటర్‌తో థియేటర్‌కు వచ్చి సినిమా చూసే వీరాభిమాని కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 


షారుక్ ఖాన్ డై హార్డ్ ఫ్యాన్స్ లో అనీస్ ఫారూకీ ఒకరు. కాకపోయితే అతను అందరిలాంటి వ్యక్తి కాదు. పుట్టుకతోనే శారీరక వికలాంగుడు. వీల్ చైర్ మీద కూర్చొని వెంటిలేటర్‌ సహాయంతో జీవిస్తున్నాడు. అయినప్పటికీ తన ఫేవరేట్ హీరో పట్ల అమితమైన అభిమానాన్ని చూపిస్తుంటాడు. షారుక్ సినిమా ఏది వచ్చినా మిస్ అవ్వకుండా చూస్తాడు. ఇటీవల విడుదలైన 'జవాన్' మూవీ కూడా చూశాడు. అది కూడా స్వయంగా థియేటర్ కు వెళ్లి మరీ సినిమా చూసి ఎంజాయ్ చేశాడు. 


అనీస్ ఫారూకీ 'జవాన్' సినిమా చూస్తున్న వీడియోని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. షారూఖ్ ఖాన్ మీద అభిమానంతో అతను తన వెంటిలేటర్‌తో థియేటర్ కు వచ్చి, వీల్ చైర్ లో కూర్చొని మూవీ చూడటాన్ని మనం గమనించవచ్చు. ఇది చూసిన వారంతా, ఇతనే కింగ్ ఖాన్ కు నిజమైన వీరాభిమాని అని కామెంట్లు చేస్తున్నారు. అతనికి షారుక్ అంటే ఎంత అభిమానమో అర్థమవుతుందని అంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 






'పఠాన్' తో సాలిడ్ కంబ్యాక్..
షారుక్ ఖాన్ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఢీలా పడిపోయాడు. 'జీరో' మూవీ డిజాస్టర్ గా మారిన తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకు రావడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నాడు. అయితేనేం 'పఠాన్' సినిమాతో తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి రుచి చూపించాడు. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ క్రమంలో లేటెస్టుగా 'జవాన్' మూవీతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 


తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ డ్యూయెల్ రోల్ లో నటించిన సినిమా 'జవాన్'. ఇందులో షారుక్ సరసన నయనతార, దీపికా పదుకునే హీరోయిన్లుగా నటించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా కనిపించగా.. ప్రియమణి, సన్యా మల్హోత్రా కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 7వ తేదీన విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 735 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి, వెయ్యి కోట్ల క్లబ్ దిశగా పయనిస్తోంది. 


షారుక్ ఖాన్ 2023లో హ్యాట్రిక్ హిట్టు మీద గురి పెట్టాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటిస్తున్న 'డుంకి' సినిమాని క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది. ఒకవేళ ఈ మూవీ కూడా హిట్టయితే. ఒక ఏడాది బ్యాక్ టూ బ్యాక్ మూడు బ్లాక్ బస్టర్స్ సాధించిన హీరోగా కింగ్ ఖాన్ రికార్డ్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో చూడాలి.


Also Read: '7/G బృందావన కాలనీ' రీరిలీజ్ ట్రైలర్ - మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా?






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial