Shaakuntalam: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం 'శాకుంతలం' (Shaakuntalam) ఏప్రిల్ 14న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీలో కథానాయికగా సమంత నటిస్తుండగా.. దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నఈ సినిమాకు సంబంధించి మూవీ టీం ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అయితే ప్రచార కంటెంట్ గా ఎంచుకున్న ప్రీమియర్ షోస్ ఆలోచన బెడిసి కొట్టినట్టు తెలుస్తోంది. ఇవి ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న'శాకుంతలం' సినిమా 2డీ (2D)తో పాటు, 3డీ (3D)లోనూ అందుబాటులో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే మూవీ టీం.. 3డీ వెర్షన్‌పై బాగానే ఆశలు పెట్టుకున్నారు. అంతే కాదు ఇది సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌‌‌గా మారుతుందని అంచనా వేశారు. ఎందుకంటే 'శాకుంతలం' 3డీ ప్రదర్శన నిర్ణయం తీసుకోవడం వల్ల సినిమా బడ్జెట్ పెరిగిపోయిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంతే కాదు ఈ సమయానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న'శాకుంతలం' సినిమా.. త్రీడీ షో నిర్ణయం వల్లే సినిమా పలుమార్లు వాయిదా పడిందని టాక్ వినిపిస్తోంది. అందుకే దీన్ని మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 


'శాకుంతలం' టీమ్ తమ సినిమా అవుట్‌ పుట్‌‌పై చాలా నమ్మకంగా ఉంది. అదే నమ్మకంతో ఏప్రిల్ 10న రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 'శాకుంతలం' 3D వెర్షన్ ప్రీమియర్‌ ప్రదర్శించారు. సినిమాకు హెల్ప్ అయ్యే పాజిటివ్ టాక్ వస్తుందని యూనిట్ భావించింది. కానీ ఆశ్చర్యకరంగా ప్రీమియర్స్ నుంచి సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిందని, కొందరి దగ్గరి నుంచైతే అవరేజ్ కన్నా తక్కువ రెస్పాన్స్ వచ్చిందని రిపోర్ట్స్ రావడం 'శాకుంతలం' టీమ్‌కి పెద్ద షాక్ ఇచ్చింది. వీరి రెస్పాన్స్ ఎలా ఉన్నా.. మూవీ రిలీజ్ అయిన తర్వాత యావత్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ఇచ్చే రివ్యూల మీదే మూవీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.


భారీ బడ్జెట్‌తో రూపొందించబడిన 'శాకుంతలం' అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కాళిదాసు సంస్కృత నాటకం 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా రూపొందించబడింది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదలయ్యేందుకు ఈ సినిమా సిద్ధంగా ఉంది. 3డీలోనూ విడుదల కానున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై గుణ టీమ్‌ వర్క్స్‌తో కలిసి నీలిమ గుణ నిర్మిస్తున్నారు.






ఇక సమంత నటించిన 'శాకుంతలం' చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ రాజు.. దుష్యంత్ పాత్రను పోషిస్తుండగా, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ.. ప్రిన్స్ భరత్‌గా నటించింది. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధు, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు.


Read Also: అందుకే ‘శాకుంతలం’ నేటితరం అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది : సమంత