Serial Actor Kaushik Krishna: చాలామంది సీరియల్ ఆర్టిస్టులు సినిమాల్లో కూడా తమ టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్టులుగా తమ కెరీర్లను ప్రారంభించిన పలువురు సీరియల్ ఆర్టిస్టులు.. ఇంకా బుల్లితెరపై అలరిస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో కౌశిక్ కృష్ణ ఒకరు. ఆఫ్ స్క్రీన్ అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉండే కౌశిక్.. కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు. దాని వెనుక అసలు కారణమేంటో తాజాగా బయటపెట్టారు. అంతే కాకుండా మోహన్ బాబుతో ఆయనకు జరిగిన ఇంటరాక్షన్ గురించి గుర్తుచేసుకుంటూ ఆయనను ప్రశంసించారు.


అప్పుడలా.. ఇప్పుడిలా..


తనతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చినవాళ్లలో ఇప్పటికీ తక్కువమందే ఇంకా ఆర్టిస్టులుగా ఉన్నారని చెప్పుకొచ్చారు కౌశిక్ కృష్ణ. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తనతో పనిచేసేవాళ్లంతా చాలా సంపాదించుకున్నారని, తాను మాత్రం ఉన్నదాంట్లోనే తృప్తిగా ఉన్నానని తెలిపారు. ఆర్టిస్ట్ అనేవాడు సముద్రపు అలలాగా ఉండాలని, రాజకీయ నాయకులలాగానే ఆర్టిస్టులపై నెగిటివ్ కామెంట్స్ వస్తాయి భరించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకప్పుడు రోజుకు నాలుగు షిఫ్ట్స్ చేశానని గుర్తుచేసుకున్నారు. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు ఎంతలా మారిపోయారో చెప్పుకొచ్చారు. ‘‘మధ్యలో ఇండస్ట్రీ వదిలేద్దామనుకున్నాను. ఇక్కడ చాలా పాలిటిక్స్ ఉన్నాయి. నాకు అవన్నీ రావు. అలా చేయడం కూడా ఒక కళ. నాకు వేరేవాళ్లను పొగడడం, భజన చేయడం రాదు’’ అని ఓపెన్‌గా చెప్పేశారు కౌశిక్.


అందుకే కష్టాలు..


‘‘నాకు లౌక్యంగా ఉండడం రాదు. వచ్చినా నేను అలా చేయను. చేసేవాళ్లను నేను తప్పుబట్టను. ఎవరి లైఫ్ వాళ్లది. నేను కూడా మనిషిగా చాలా తప్పులు చేస్తాను. నేనే అలా ఉన్నప్పుడు ఇంకొకడి గురించి నేను ఎలా మాట్లాడగలను? నా నెగిటివ్ ఏంటో నాకు క్లారిటీ ఉంది. ఇండస్ట్రీలో రాజకీయం ఉంది. అది నాకు ఇష్టమే కానీ ఒక మనిషి పొట్టకొట్టి మనం బాగుపడాలి అనే కాన్సెప్ట్ నాకు నచ్చదు. నేను స్టార్ అయిపోవాలని ఎప్పుడూ కోరుకోలేదు. ముందు నుండి ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటాను. లౌక్యం తెలియకపోవడం వల్ల చాలా కష్టాలు ఎదుర్కున్నాను. యాక్టర్‌గా పీక్ కెరీర్ చూసి మళ్లీ కొన్నిరోజులు ఆర్జేగా చేసి మళ్లీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాను’’ అంటూ జరిగిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు కౌశిక్ కృష్ణ.


బాధ అనిపించింది..


మోహన్ బాబు గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయన మనసులో ఏం దాచుకోకుండా మాట్లాడేస్తారు. నాకు ఆయనతో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. మంచు మనోజ్ హీరోగా రాజుభాయ్ అనే సినిమా తీశారు. అందులో ఒక క్యారెక్టర్‌కు రాజీవ్ కనకాల నన్ను రిఫర్ చేశారు, వెళ్లి కలవమన్నారు. మోహన్ బాబు నన్ను పిలిచి నువ్వు యాక్టింగ్ బాగా చేస్తావంట కదా అంటూ మాట్లాడారు. ఫైనల్‌గా నేను నీకు ఈ క్యారెక్టర్ ఇవ్వడం లేదన్నారు. మంచి ఆర్టిస్టులు ఎప్పుడూ చిన్న క్యారెక్టర్లు చేయకూడదు అన్నారు. అలా మాట్లాడతారని ఊహించలేం. ఒక్క సీన్ ఉన్న క్యారెక్టర్ అయినా ప్రాముఖ్యత ఉంది. అది పోయినందుకు బాధ అనిపించింది కానీ మోహన్ బాబు చెప్పిన విధానం నచ్చింది’’ అని గుర్తుచేసుకున్నారు కౌశిక్ కృష్ణ.



Also Read: ఏకంగా హీరోను, అతడి తండ్రిని కొట్టి చంపేసిన జనాలు - అసలు ఏం జరిగింది?