Actress Kasthuri About Bharateeyudu Movie: సీనియర్ నటి కస్తూరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. అన్ని భాషల్లోనూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. తెలుగులో ఆమె నటించిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. తెలుగులో ‘అన్నమయ్య’, ‘పెద్దరికం’ లాంటి అద్భుత సినిమాల్లో నటించారు. ‘భారతీయుడు’లో కీలక పాత్ర పోషించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన కెరీర్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో ఎదుర్కొన్న ఆసక్తికర సంఘటనల గురించి ప్రస్తావించారు.  


‘భారతీయుడు’ గురించి కస్తూరి ఆసక్తికర వ్యాఖ్యలు


నిజానికి నటి కస్తూరి ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెప్తారు. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తారు. తన మనసులో మాటను చెప్పేందుకు ఎలాంటి మొహమాటం ఉండదు. తన అభిప్రాయాన్ని విని ఎవరో ఏదో అనుకుంటారని చెప్పకుండా ఊరుకోరు. ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ లో తులసి పాత్రలో అద్భుతంగా అలరిస్తున్న కస్తూరి తాజాగా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పుకొచ్చారు. శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడం అంటే ఎంతో అదృష్టం అని వివరించారు. తనకు ఆయనతో కలిసి పని చేసే అవకాశం చిన్న వయసులోనే వచ్చినట్లు చెప్పారు.


స్విమ్ సూట్ పిక్స్ పంపితే సిస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు!


‘భారతీయుడు’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తాను ప్రయత్నించినట్లు కస్తూరి చెప్పారు. ఇందుకోసం దర్శకుడు శంకర్ కు స్విమ్ సూట్ లో ఉన్న ఫోటోలను పంపించినట్లు వివరించారు. అదే సమయంలో ‘రంగీలా’ సినిమా ప్రమోషన్స్ మొదలైనట్లు చెప్పారు. అప్పుడు ఎవరి నోట విన్నా ఊర్మిళ గురించే మాట్లాడుకున్నారని  వెల్లడించారు. అందుకే ఈ సినిమాలో ఆమెకు హీరోయిన్ పాత్ర ఇచ్చినట్లు చెప్పారు. చివరకు తనకు కమల్ హాసన్ చెల్లి క్యారెక్టర్ ఇచ్చినట్లు వివరించారు. కమల్ హాసన్ తో చెల్లిగా నటించడం ఏంటని దర్శకుడిని అడిగితే, ఈ క్యారెక్టర్ చాలా కీలకమైనదని చెప్పడంతో చేయాల్సి వచ్చిందన్నారు. ఈ సినిమా విడుదల అయ్యాక తనకు మంచి పేరు వచ్చిందని చెప్పుకొచ్చారు కస్తూరి.  


ఇప్పటికీ సినిమాల్లో నటించడం అంటే ఇష్టం


ఇప్పటికీ తనకు సినిమాల్లో నటించడం ఇష్టమేనని వివరించారు కస్తూరి. అయితే, తన కెరీర్ లో ఎలాంటి ప్రయోగాలు చేయలేదని చెప్పారు. అది తప్ప నటిగా తనకు ఎలాంటి లోటు కనిపించలేదని వెల్లడించారు. తనకు వయసుకు తగిన పాత్రలు వస్తే చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. ఇక తరచుగా సినిమాలతో పాటు బుల్లితెర పైనా రాణిస్తున్నారు కస్తూరి. ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన కస్తూరి ఇప్పుడు టీవీ రంగంలోనూ రాణిస్తున్నారు.


Read Also: ప్రియాంక పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? నిక్ జోనాస్​ను మధు చోప్రా అనుమానించిందా?