రోజుకో కొత్త హీరోయిన్ పరిచయమవుతున్న సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందం అభినయం, టాలెంట్ తెలుగు పాటుగా కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. దీనికి సక్సెస్ కూడా యాడ్ అయితే కొన్నాళ్ళు రాణించగలుగుతారు. అదే బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొడితే, గోల్డెన్ లెగ్ గా ముద్రవేసి వరుస అవకాశాలు అందిస్తుంటారు. ఇప్పుడు ఇదంతా హీరోయిన్ సంయుక్త మీనన్ విషయంలో జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

 

సంయుక్త మీనన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'పాప్ కార్న్' అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ కేరళ కుట్టి.. తమిళ మలయాళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఐశ్వర్య రాజేష్ తప్పుకోవడంతో చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన సంయుక్త.. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. 

 

'భీమ్లా నాయక్' తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ నటించిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇదే క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో చేసిన తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీ 'సార్' కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది.. రూ.100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. 

 

ఇలా వరుసగా మూడు హిట్లు పడటంతో సంయుక్త మీనన్ లక్కీ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది. ఈమె నటించిన సినిమాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని మేకర్స్ భావించే పొజిషన్ కు చేరుకుంది. ఈ సెంటిమెంట్ ని నిజం చేస్తూ లేటెస్ట్ గా 'విరూపాక్ష' చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ మలయాళ బ్యూటీ. 

 

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం 'విరూపాక్ష'. కార్తిక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీకి స్టార్ డైరక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. సుకుమార్ రైటింగ్స్ సహకారంతో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. గత శుక్రవారం రిలీజైన ఈ మిస్టికల్ థ్రిల్లర్.. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇందులో సంయుక్త పోషించిన ఇంటెన్స్ రోల్ కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 

 

ఎలా అయితేనేం సంయుక్త మీనన్ ఖాతాలోకి బ్యాక్ టూ బ్యాక్ నాలుగు హిట్లు రావడంతో, టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. సంయుక్త ఉంటే చాలు.. సినిమా హిట్ అనే టాక్ వచ్చేసింది. దీంతో గోల్డెన్ లెగ్ గా భావిస్తూ ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం మేకర్స్ అంతా ఆమె వెంట పడుతున్నారని తెలుస్తోంది. సక్సెస్ లో ఉండటమే కాదు.. హోమ్లీగా ఉన్న గ్లామరస్ హీరోయిన్ కావడంతో, అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని అంటున్నారు.

 

ప్రస్తుతం కల్యాణ్ రామ్ సరసన డెవిల్ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఆమెకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అభిషేక్ నామా నిర్మించే ఈ పీరియాడిక్ చిత్రాన్ని తెలుగుతో పాటుగా హిందీ మలయాళ కన్నడ తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. మరి సంయుక్త రానున్న రోజుల్లో మరిన్ని బ్లాక్ బస్టర్స్ సాధించి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారుతుందేమో వేచి చూడాలి.