సినిమా వాళ్లకి సంక్రాంతి అనేది చాలా పెద్ద సీజన్. అందుకే సంక్రాంతికి రావాలని స్టార్ హీరోల నుండి మీడియం, చిన్న హీరోల వరకు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చివరికి ఓ నాలుగైదు సినిమాలు మాత్రమే సంక్రాంతి బరిలోకి దిగుతాయి. ఎప్పటిలానే ఈసారి కూడా మూడు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి పోటీపడబోతున్నాయి. అందులో ఈ సంక్రాంతికి మొట్టమొదటిగా థియేటర్లలోకి దిగే చిత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ప్రీ రిలీజ్ వేడుకకు ముస్తాబవుతోంది. జనవరి 4న ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ వేడుక ఏపీలోని రాజమండ్రిలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం చిత్ర ట్రైలర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
‘గేమ్ చేంజర్’ విడుదలైన రెండు రోజులకు నందమూరి నటసింహం బాలయ్య.. ‘డాకు మహారాజ్’గా థియేటర్లలోకి మాస్ బీభత్సాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంక్రాంతికి చిరుతో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ కొట్టిన బాబీ కొల్లి దర్శకుడు. జనవరి 12న థియేటర్లలోకి రానున్న ‘డాకు మహారాజ్’ ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. గురువారం ‘దబిడి దిబిడి’ అంటూ మోతమోగే పాటతో ఫ్యాన్స్‌లో హుషారు తీసుకొచ్చింది టీమ్. ‘గేమ్ చేంజర్’ని ఫాలో అవుతూ.. అమెరికాలో జనవరి 4న గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకలోనే చిత్ర ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు.
ఈ రెండు సినిమాలతో పాటు జనవరి 14న సంక్రాంతి రోజు.. సంక్రాంతి వైభవాన్ని తీసుకొచ్చేందుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ విక్టరీ వెంకటేష్ థియేటర్లలోకి దిగబోతున్నారు. ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ సినిమాలు మాస్ అండ్ యాక్షన్ అన్నట్లుగా లోడ్ అవుతుంటే.. వెంకీ మాత్రం సింపుల్‌గా ఇద్దరు హీరోయిన్లను వేసుకుని.. ఏపీ, తెలంగాణలలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు పెద్ద సక్సెస్ అవడం, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో వెంకీ ఎనర్జీ ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. అందులోనూ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు కావడంతో.. సంక్రాంతికి తిరుగులేని హిట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిలుస్తుందనే అభిప్రాయాన్ని ఇప్పటికే ఈ సినిమా ఇచ్చేస్తోంది.
Also Read: గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
ఈ మూడు సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ ఇదే..
‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’.. సంక్రాంతికి వస్తున్న ఈ మూడు సినిమాలలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే.. ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్ చరణ్ IPS, IAS పాత్రలలో దర్శనమిస్తుంటే.. ‘డాకు మహారాజ్’లో నటసింహం బాలయ్య కూడా IAS ఆఫీసర్‌గా కనిపించనున్నారని చిత్ర నిర్మాత, దర్శకుడు క్లారిటీ ఇచ్చేశారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకీ మామ రీటైర్డ్ IPS ఆఫీసర్‌గా కనిపించనున్నారని, సినిమా ప్రారంభం రోజే మేకర్స్ వెల్లడించారు. అంటే, సంక్రాంతికి రాబోతోన్న సినిమాలలోని హీరోలంతా ప్రభుత్వ అధికారులే కావడం విశేషం. అందులోనూ IAS, IPS పాత్రల్లోనే వారు కనిపిస్తుండటం నిజంగా యాధృచ్ఛికమే అని చెప్పుకోవచ్చు. మరీ ఈ పాత్రలతో ఎవరు బాక్సాఫీస్ కింగ్‌గా, సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తారో తెలియాలంటే మాత్రం.. ఫెస్టివల్ వరకు ఆగాల్సిందే.
Also Read: బాలయ్యో... ఆ దంచుడేందయ్యో... ఊర్వశితో దబిడి దిబిడే... ఇక హిస్టరీ రిపీటే