Sanjay Leela Bhansali About Pak Audience Support: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాప్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ. ఊహకు అందని సరికొత్త కథాంశాలతో సినిమాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి. ఆయన దర్శకత్వం వహించి సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. ఈ వెబ్ సిరీస్ తో ఆయన ఓటీటీలోకి అడుగు పెట్టారు. ఆరుగురు స్టార్ హీరోయిన్లతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, సంజీదా షేక్, రిచా చద్దా, షర్మిన్ సెగల్, ఫర్దీన్ ఖాన్, శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో పాక్తిస్తాన్ లో జరిగిన వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని ఆయన ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. పాక్ రెడ్ లైట్ ఏరియాలోని మహిళలు స్వాతంత్ర్య సంగ్రామంలో ఎలా భాగం అయ్యారనేది ఇందులో చూపించారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

  


పాకిస్తాన్ పై భన్సాలీ సంచలన వ్యాఖ్యలు


 తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా భన్సాలీ ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెరకెక్కించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ కథ పాక్ లోని పంజాబ్ బేస్ గా కొనసాగుతుందన్నారు. ఈ సిరీస్ చూసిన తర్వాత పాకిస్తాన్ నుంచి తనకు ఎంతో ప్రేమ లభిస్తుందని వెల్లడించారు. అక్కడి ప్రజలు ఈ వెబ్ సిరీస్ చూసేందుకు ఎంతో ఇష్టపడుతున్నారని చెప్పారు. "పాకిస్తాన్ నుంచి చాలా అభినందనలు వస్తున్నాయి. అక్కడి వాళ్లు ఎంతో ప్రేమను కనబరుస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ వెబ్ సిరీస్ పాక్ లోని పంజాబ్ కేంద్రంగా కొనసాగుతుంది. పాకిస్తానీయులు, భారతీయులు అంతా ఒక్కటేనని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. నా వెబ్ సిరీస్ పై రెండు దేశాల ప్రేక్షకులు మంచి ఆదరణ కనబరుస్తున్నారు. మనందరం చాలా విషయాల్లో కనెక్ట్ అయ్యాం. కొంత మందిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇరు దేశాల ప్రజల మధ్య ప్రేమ ఉన్నది అనేది వాస్తవం” అని చెప్పుకొచ్చారు.


అలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోను!


కొంత మంది ‘హీరామండి: ది డైమండ్ బజార్’ సిరీస్ మీద విమర్శలు చేయడంపైన ఆయన స్పందించారు. ‘‘నా చిత్రాల్లో  వ్యక్తులకు కనెక్ట్ అయ్యే పాత్రల్లో పాత్రలు ఉంటాయి. కొంత మందికి నచ్చుతాయి. మరికొంత మందికి నచ్చవు. అది వారి వ్యక్తిగత విషయం. నా పనితనం నచ్చిన వాళ్లు మెచ్చుకుంటారు. నచ్చని వాళ్లు విమర్శిస్తారు. ఆ విమర్శలను నేను పెద్దగా పట్టించుకోను” అని భన్సాలీ అభిప్రాయపడ్డారు.


Read Also: ‘పుష్ప.. పుష్ప’ సాంగ్ - బన్నీచేతిలోని గ్లాస్ నుంచి టీ ఎందుకు ఒలకలేదో తెలుసా? కారణం ఇదే!