అభిమాన హీరోల సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయంటే చాలు ఫ్యాన్స్ చేసే సందడి అంతా కాదు. థియేటర్ల ముందు టపాసులు పేల్చడం దగ్గర నుంచి మొదలు పెడితే... భారీ కటౌట్లు, థియేటర్లలో ఈలలు గోలలు, హీరో ఎంట్రీ రాగానే పేపర్లు చల్లడం వంటి హంగామా గట్టిగానే ఉంటుంది. కానీ తాజాగా జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అందరినీ షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ ఘటన ఇకపై థియేటర్ల దగ్గర ఎలాంటి హంగామా లేకుండా చేసింది. 


సంధ్య థియేటర్ వద్ద కొత్త రూల్స్ 
హైదరాబాద్లో ఉన్న కొన్ని థియేటర్లను సెంటిమెంట్ గా భావిస్తారు. అందులో సంధ్య థియేటర్ కూడా ఒకటి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న ఈ థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో తమ అభిమాన హీరోల సినిమాలు చూడాలని ఎంతోమంది అభిమానులు ఉత్సాహపడుతుంటారు. కానీ ఆ ఉత్సాహం ప్రాణాల మీదకు తీసుకొస్తే, అది పూడ్చలేని నష్టం అవుతుంది. అందుకే తాజాగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ఒకసారిగా ఉలిక్కిపడింది టాలీవుడ్. దీంతో ఇప్పుడు సంధ్య థియేటర్ దగ్గర ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా కండిషన్స్ పెట్టింది సదరు థియేటర్ యాజమాన్యం.


అందులో భాగంగా ప్రతి ఒక్కరూ లైన్ లోనే థియేటర్లోకి అడుగు పెట్టాలని, టికెట్ లేనివారికి ఎంట్రీ లేదని స్ట్రిక్ట్ గా గేటు బయట పెద్ద పెద్ద పోస్టర్ల ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా థియేటర్లలో క్రాకర్స్ పేల్చవద్దని, మంటలకు కారణమయ్యే ఇతర ఐటమ్స్ ని, లైటర్స్ లాంటి వాటిని తీసుకురావద్దని హెచ్చరించింది. ఒకవేళ ఈ కండిషన్స్ ను ఫాలో అవ్వకపోతే చట్టపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు "క్రాస్ రోడ్స్ లో ఇకపై సెలబ్రేషన్స్ ఉండవా?" అంటూ డిలా పడుతున్నారు. 


అసలు వివాదం ఏంటంటే ? 
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' అనే పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ షోలలో భాగంగా డిసెంబర్ 4న రాత్రి అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో సినిమాను చూడడానికి వచ్చారు. ఈ విషయం తెలిసిన అభిమానులు భారీ ఎత్తున అక్కడికి తరలిరాగా, ఓ మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాటలో చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తీవ్ర వివాదానికి దారి తీయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు. ఇక ఈ ఘటనకు కారణం అంటూ అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు కాగా, 'పుష్ప 2' చిత్ర బృందం శ్రీతేజకి రెండు కోట్ల భారీ సాయాన్ని ప్రకటించింది.


వివాదమైతే సద్దుమణిగింది. కానీ అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం ఈ కేసులో ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అభిమానులు భారీ ఎత్తున తరలివస్తారని తెలిసినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందంటూ విమర్శలు వినిపించాయి. దీంతో మరోసారి అలాంటి ఘటన రిపీట్ కాకుండా ఉండడానికే సంధ్య థియేటర్ యాజమాన్యం తాజాగా ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. దీంతో 'గేమ్ ఛేంజర్' మూవీకి ఎలాంటి హడావిడి లేకుండా పోయింది.


Also Readవెండితెరకు రాజకీయ రంగులు... తెలుగులో బెస్ట్ పొలిటికల్ ఫిలిమ్స్ - 'గేమ్ చేంజర్'కు ముందు... మీరెన్ని చూశారు?