బాలీవుడ్ మాజీ నటి సనా ఖాన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆమెకు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు, తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సనా 2020లో ముఫ్తీ అనాస్ సయీద్‌ను వివాహం చేసుకుంది. తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పింది. తాజాగా సనా ఖాన్ జంట ఓ శుభవార్త చెప్పారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సనా దంపతులు తమ మొదటి సంతానం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరి వివాహం జరిగిన మూడేళ్ళ తర్వాత సనా తల్లి అయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇంటర్వ్యూలో సనా ఖాన్ మాట్లాడుతూ.. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. నిజంగా ఇది ఎంతో అద్బుతమైన ప్రయాణం అని పేర్కొంది. తాము తమ మొదటి సంతానాన్ని కుటుంబంలోకి స్వాగతించడానికి సిద్దంగా ఉన్నామని, బిడ్డను తన చేతుల్లోకి తీసుకోవడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, అప్పటి వరకూ వేచి ఉండలేకపోతున్నాను అంటూ ఉద్వేగానికి లోనౌతూ చెప్పుకొచ్చింది సనా. ఇదొక కొత్త అనుభూతి అని చెప్పిన సనా తమకి కవలలు పుట్టడం లేదని, భవిష్యత్ లో ఇంకా పిల్లల్ని కనవచ్చని వ్యాఖ్యానించింది. సనా తల్లి కాబోతోందని తెలియడంతో ఆమె అభిమానులు విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. 


సనా ఖాన్ కెరీర్ పీక్స్ లో ఉండగా సినిమాలకు గుడ్ బై చెప్పింది. అక్టోబర్ 8, 2020లో తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అది చూసి ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు. తాను ఇకపై సినిమాలలో నటించనని ప్రకటించింది. తాను దైవసాక్షాత్కారం పొందానని, ఒక నుంచి ఆధ్యాత్మిక సేవలో ఉంటానని చెప్పుకొచ్చింది. సనా స్టేట్మెంట్ బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. అంతే కాదు తన సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న సినిమాలకు సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలను డిలీట్ చేసింది సనా. అప్పటికే ఆమెకు నెట్టింట మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత నెల నవంబర్ లో ఆమె ముఫ్తీ అనాస్ సయిూద్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయింది సనా. 


సనా ఖాన్ మోడల్ గా కెరీర్ ను ప్రారభించింది. తర్వాత పలు యాడ్ ఫిల్మ్ లలో నటించింది. 2005 లో వచ్చిన హిందీ సినిమా ‘యో హై హై సొసైటీ’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సనా. హిందీతో పాటు తమిళం సినిమాలలో ఎక్కువగా నటించింది. కన్నడ, మలయాళంతో పాటు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2010లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమాలో నటించింది. తర్వాత ‘గగనం’ సినిమాలో కూడా ఓ పాత్రలో కనిపించింది. తర్వాత ‘మిస్టర్ నూకయ్య’, ‘గజ్జెల గుర్రం’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి సినిమాల్లో నటించింది సనా ఖాన్. 


Read Also: యూట్యూబ్ నుంచి ‘భీడ్‘ ట్రైలర్ తొలగింపు, ప్రజాస్వామ్య హత్య అంటూ నెటిజన్ల ఆగ్రహం