Samantha Review on HanuMan: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీకి ప్రేక్షకుల దగ్గర నుంచి మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు.. ఇలా అందరి దగ్గర నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా సమంత కూడా ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. డైరెక్టర్ కమ్ యాక్టర్‌తో సమంత ‘హనుమాన్’ సినిమాను చూసింది. దానికి సంబంధించి తను షేర్ చేసిన ఫోటోలు, రివ్యూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గురువారం రాత్రి.. రాహుల్ రవీంద్రన్‌తో కలిసి ఏఎంబీలో ‘హనుమాన్’ చూడడానికి వెళ్లింది సామ్. ఆ తర్వాత సినిమాపై తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.


నన్ను సర్‌ప్రైజ్ చేశావు..
‘మనలోని చిన్నిపిల్లల మనస్తత్వాన్ని బయటికి తీసుకొచ్చే సినిమాలే గొప్ప సినిమాలు అని నేను నమ్ముతాను. ఎగ్జైటింగ్ విజువల్స్, సినిమాటిక్ హై, హ్యూమర్, మ్యాజిక్, దాంతో పాటు అద్భుతమైన మ్యూజిక్, విజువల్స్, పర్ఫార్మెన్స్‌లు.. ఇలా అన్ని ఒకే దగ్గర చేరాయి. హనుమాన్‌ను పెద్ద స్క్రీన్‌‌పై చూడడం అద్భుతంగా ఉంది. థాంక్యూ ప్రశాంత్ వర్మ. నీ యూనివర్స్‌లోని తరువాత చాప్టర్లను చూడడానికి ఎదురుచూస్తున్నాను. తేజ సజ్జా.. నువ్వు నన్ను సర్‌ప్రైజ్ చేశావు. నీ కామెడీ టైమింగ్, నీ అమాయకత్వం, హనుమంతుగా నీ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్.. సినిమాకు ప్రాణం పోశాయి. క్యాస్ట్ మొత్తానికి కంగ్రాట్స్’ అంటూ ‘హనుమాన్’పై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది సమంత. అంతే కాకుండా ఈ స్టోరీలో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా, వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ట్యాగ్ చేసింది.


ఇంకా ఇంకా చూడాలనిపించేలా..
‘మ్యూజిక్, వీఎఫ్‌ఎక్స్ అంతా ఈ ప్యాకేజ్‌ను చాలా అద్భుతంగా కట్టిపడేశాయి. ఇంకా ఇంకా చూడాలనిపించేలా చేశాయి’ అంటూ మ్యూజిక్, విజువల్స్‌పై ప్రశంసలు కురిపించింది సమంత. ఇప్పటికే శివ రాజ్‌కుమార్, రిషబ్ శెట్టి లాంటి ఎందరో స్టార్ నటీనటులు ‘హనుమాన్’ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 2024 సంక్రాంతికి తెలుగు నుంచి మొత్తం నాలుగు సినిమాలు విడుదల కాగా.. ‘హనుమాన్’కే ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. పైగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడంతో.. దీని కలెక్షన్స్ ఒక రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో ‘హనుమాన్’ జోరు కొనసాగుతోంది. విడుదలయ్యి వారం రోజులు అయినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ మూవీ టికెట్స్ కోసం ఎగబడుతున్నారు ప్రేక్షకులు.


తేజకు సమంత సపోర్ట్..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు తేజ సజ్జా. చిన్న వయసులోనే ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను చేశాడు. ఇక పెద్దయిన తర్వాత ముందుగా ‘ఓ బేబి’ అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ కొత్తగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సమంత హీరోయిన్‌గా నటించింది. అందుకే అప్పటినుంచి తేజ నటిస్తున్న ప్రతీ సినిమాకు సమంత సపోర్ట్‌గా నిలుస్తుంది. ఇంతకు ముందు తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి’కి కూడా సామ్ తన సపోర్ట్‌ను అందించింది. ఇక ఇప్పుడు ‘హనుమాన్’ మూవీకి తను ఇచ్చిన పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: ‘హనుమాన్‘ సినిమా ఓ అద్భుత కళాఖండం, కేంద్ర మంత్రుల ప్రశంసల జల్లు