Neru OTT Release: గతేడాది డిసెంబర్‌లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలా విడుదలయిన చాలావరకు చిత్రాలు సూపర్ హిట్‌ను అందుకున్నాయి. కేవలం పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే కాకుండా.. ఎన్నో ప్రాంతీయ చిత్రాలు కూడా డిసెంబర్‌లో తమ సత్తాను చాటుకున్నాయి. అందులో ఒకటి మోహన్‌లాల్ లీడ్ రోల్‌లో నటించిన ‘నేరు’. ఈ మూవీ 2023 డిసెంబర్ 21న విడుదలయ్యింది. కేవలం మలయాళంలో మాత్రమే విడుదలయిన ‘నేరు’.. ఓవర్సీస్‌లో కూడా సత్తాను చాటుకుంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యి దాదాపు నెలరోజులు అవుతుండడంతో ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ బయటికొచ్చింది.


జీతూ జోసెఫ్, మోహన్‌లాల్ కాంబినేషన్ హిట్..
‘నేరు’కు పోటీగా ఎన్నో పాన్ ఇండియా చిత్రాలు విడుదలయ్యాయి. కానీ మలయాళ స్టార్ మోహన్‌లాల్ సినిమాకే ప్రేక్షకులు ఎక్కువగా ఓటు వేశారు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీకి చాలామంది ఆడియన్స్.. ఫ్యాన్స్ అయిపోయారు. దర్శకుడు జీతూ జోసెఫ్, మోహన్‌లాల్ కాంబినేషన్‌కు మలయాళంలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్‌లో థ్రిల్లర్ సినిమా వస్తుందంటే చాలు.. చాలామంది ప్రేక్షకులు ఆసక్తికర ఎదురుచూడడం మొదలుపెడతారు. అలా ‘నేరు’పై కూడా అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు ఈ మూవీ ఏ మాత్రం తగ్గకపోవడంతో కలెక్షన్స్ విషయంలో కూడా సినిమా దూసుకుపోయింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ‘నేరు’ ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ అప్డేట్ అందించారు.


మలయాళంతో పాటు ఇతర భాషల్లో..
జనవరి 23 నుంచి ‘నేరు’ చిత్రం హాట్‌స్టార్‌లోకి అందుబాటులోకి రానుంది. కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోహన్‌లాల్‌తో పాటు లీడ్ రోల్‌లో నటించింది అనస్వరా రాజన్. వీరితో పాటు ప్రియమణి కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాంతీ మాయాదేవి.. ‘నేరు’కు సహ రచయితగా పనిచేయడంతో పాటు సినిమాలో చిన్న రోల్‌ కూడా ప్లే చేసింది. ఇక ‘నేరు’ కలెక్షన్స్ వివరాలు చూసి ఇతర భాషా ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.






రూ.100 కోట్ల కలెక్షన్స్..
కేవలం కేరళలోనే దాదాపు రూ.50 కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను టచ్ చేసింది ‘నేరు’. ఇక ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా సత్తా చాటుకుంది. అందుకే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేసినట్టు తెలుస్తోంది. మాలీవుడ్‌లో యంగ్ హీరోల సంగతి పక్కన పెడితే.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ.. అందులో వారి యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోలు అయిన మమ్ముట్టి, మోహన్‌లాల్‌ లాంటి నటులు ఇంకా బాక్సాఫీస్‌ను డామినేట్ చేస్తున్నారని మలయాళ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ‘నేరు’లాంటి థ్రిల్లర్ కథతో మోహన్‌లాల్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ‘కాథల్’లాంటి ఎమోషనల్ కథతో మమ్ముట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వయసులో కూడా సినిమాలపై మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి నటులు చూపిస్తున్న డెడికేషన్ చూసి మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు.


Also Read: వదిలేయాలనే ఆలోచన లేదు - బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో రిలేషన్‌షిప్‌పై తాప్సీ వ్యాఖ్యలు