Annual Stunt Awards: గతేడాది షారుఖ్ ఖాన్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముందుగా ‘పఠాన్’, ‘జవాన్’లాంటి యాక్షన్ సినిమాలతో వచ్చి హిట్ కొట్టిన షారుఖ్.. చివరిగా ‘డంకీ’లాంటి ఎమోషనల్ సినిమా థియేటర్లలో సందడి చేశాడు. ఇక ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల్లో ఒక రేంజ్ యాక్షన్‌ను చూపించాడు ఈ బాలీవుడ్ బాద్‌షా. అందుకే యాక్షన్, ఫైట్స్, స్టంట్స్ విషయంలో ఇంటర్నేషనల్ చిత్రాలతో పోటీ పడడానికి ‘పఠాన్’, ‘జవాన్’ సిద్ధమయ్యాయి. ఇంటర్నేషనల్ స్టంట్ అవార్డ్స్‌లో తమ అభిమాన హీరోకు సంబంధించిన రెండు సినిమాలు నామినేషన్స్‌లో ఉండడంతో షారుఖ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


‘జవాన్’ మూడు.. ‘పఠాన్’ రెండు..
తాజాగా వల్చర్ 2023 ఆన్యువల్ స్టంట్ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్స్‌ను ప్రకటించారు. కేను రీవ్స్ నటించిన ‘జాన్ విక్ 4’, టామ్ క్రూజ్ హీరోగా చేసిన ‘మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్’ చిత్రాలు ఈ నామినేషన్స్‌లో ఉన్నాయి. వీటితో పాటు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’ కూడా మూడు కేటగిరిల్లో ఎంపికయ్యింది. బెస్ట్ వెహిక్యులర్ స్టంట్, బెస్ట్ స్టంట్ ఇన్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ లాంటి కేటగిరిల్లో ఇతర ఫారిన్ చిత్రాలకు పోటీగా ‘జవాన్’ నిలబడింది. ఇక ‘పఠాన్’ కూడా రెండు కేటగిరిల్లో పోటీకి సిద్ధమయ్యింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పఠాన్’.. బెస్ట్ ఏరియల్ స్టంట్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిల్లో నామినేట్ అయ్యింది.


బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కోసం పోటీ..
ఇక బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిలో పోటీకి ఉన్న ఇతర చిత్రాలు ఏంటంటే.. ‘బెలరినా’, ‘గై రిచీస్ ది కోవనెంట్, ఎక్స్‌ట్రాక్షన్ 2, ఫిస్ట్ ఆఫ్ ది కోండర్’, ‘జాన్ విక్ - చాప్టర్ 4’, ‘మిషన్ ఇంపాజిబుల - డెడ్ రెకనింగ్ పార్ట్ 1’, ‘సైలెంట్ నైట్’, ‘షిన్ కామెన్ రైడర్’. ‘పఠాన్’కంటే ముందు చాలాకాలం వరకు షారుఖ్ ఖాన్‌కు సరైన హిట్లు లేవు. కానీ ఈ మూవీ తనను మళ్లీ రేసులో నిలబెట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1055 కోట్ల కలెక్షన్స్‌ను సాధించి.. ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పఠాన్’లో మరో హీరో జాన్ అబ్రహం కూడా కీలక పాత్రలో కనిపించాడు. ఇందులో షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనె నటించింది. షారుఖ్, దీపికా కలిసి చేసిన స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


‘పఠాన్’ కోసం రిస్కులు..
‘పఠాన్’తో 2023ను గ్రాండ్‌గా ప్రారంభించిన షారుఖ్ ఖాన్.. ‘జవాన్’తో మరో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా కోసం తమిళ దర్శకుడు అట్లీతో మొదటిసారి చేతులు కలిపాడు బాలీవుడ్ బాద్‌‌షా. ఇది కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యి.. ప్రపంచవ్యాప్తంగా రూ.1160 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఇక ‘జవాన్’తో పోలిస్తే ‘పఠాన్’ కోసం ఎన్నో రిస్కీ స్టంట్స్‌ను చేశాడు షారుఖ్. సైబీరియాలోని ఫ్రోజెన్ లేక్ బిలాల్‌లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. అది ఒక హై స్పీడ్ బైక్ చేస్ సీక్వెన్స్. ఇది మాత్రం కాదు.. ‘పఠాన్’లో ఇలాంటి స్టంట్స్ చాలానే ఉన్నాయి. అందుకే యాక్షన్ మూవీ లవర్స్‌ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. మరి ఫారిన్ సినిమాలను దాటి ఫారుఖ్.. ఈ స్టంట్ అవార్డులను గెలవగలడేమో చూడాలి.


Also Read: ఆ లక్ష్యంతోనే ‘అన్నపూర్ణి’ని తెరకెక్కించాం - ఎట్టకేలకు స్పందించిన నయనతార