Union Ministers  Praise Hanuman Movie: యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన ‘హనుమాన్‘ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టి  కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్ లోనూ మంచి సక్సెస్ అందుకుంటోంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతున్నారు. రోజు రోజుకు ప్రేక్షకుల నుంచి స్పందన మరింతగా పెరుగుతోంది.


‘హనుమాన్’ మూవీపై కేంద్ర మంత్రుల ప్రశంసలు


ఇక ఇప్పటికే ‘హనుమాన్’ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి, తెలుగు అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, నటి సమంత ఈ సినిమా అద్భుతం అన్నారు. ఇప్పుడు ఈ సినిమాపై పలువురు కేంద్ర మంత్రులు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ ను ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ ఫోటోలను కేంద్ర మంత్రులు ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ సినిమా బృందాన్ని అభినందించారు. “‘హనుమాన్’ సినిమా ఓ అద్భుత కళాఖండం. ‘హనుమాన్’ మూవీ మన సనాతన ధర్మాన్ని  అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టం కనిపిస్తోంది. ‘హనుమాన్’ టీమ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటుడు తేజ సజ్జా, నిర్మాత నిరంజన్ రెడ్డి అద్భుతమైన సినిమాను నిర్మించారు” అంటూ అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.






అటు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ‘హనుమాన్’ సినిమా పై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి టికెట్ మీద 5 రూపాయల చొప్పున అయోధ్య రామాలయానికి విరాళంగా ఇస్తామని ప్రకటించడం నిజంగా అభినందనీయం అన్నారు.






2025లో ‘హనుమాన్’ రెండో భాగం విడుదల


జనవరి 12న ‘హనుమాన్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అయ్యింది. హనుమంతుడి మహిమలో అద్భుత శక్తులు పొందే యువకుడు వాటిని ఎలా ఉపయోగించాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో తేజ సజ్జకు జంటగా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, సముద్ర ఖని, గెటప్ శ్రీను ‘హనుమాన్’ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.  ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ మూవీ ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం ‘జై హనుమాన్’ 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ సినిమా ఎండ్ కార్డ్ లోనే ప్రకటించారు. ప్రస్తుతం ఆ సినిమా పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.


Read Also: విజువల్‌ ట్రీట్‌ ఇచ్చిన 'హనుమాన్‌' విగ్రహం నిజంగా ఉందా? మూవీ షూటింగ్‌ లొకేషన్స్‌ ఎక్కడంటే..