TSCHE Chairman Limbadri: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) చైర్మెన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రిని కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా వైస్‌ చైర్మెన్‌గా వి. వెంకటరమణను కూడా కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జనవరి 18న జీవోనెంబర్‌ 96ను విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా 2021 ఆగస్టు 25 నుంచి ఆచార్య లింబాద్రి కొనసాగగా.. 2023 జూన్ 26 నుంచి రెగ్యులర్ ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన్ను మూడేళ్లపాటు పదవీలో కొనసాగాలని గత జూన్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.


రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల చైర్మెన్లు, వైస్‌ చైర్మెన్లు, సభ్యులను తొలగిస్తూ డిసెంబరు 10న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్‌ వి వెంకటరమణను కూడా తొలగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్లు 16,17ను విడుదల చేసింది. అయితే ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో పునరాలోచనలో పడిన సర్కార్ మళ్లీ వారే కొనసాగాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. 


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ లింబాద్రి పాల్గొన్నారు. కానీ ఆయన కొనసాగింపునకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు రాకుండానే ఆయన పాల్గొనడంపై విద్యాశాఖ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.  గతనెల పదో తేదీ నుంచి ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకు తెరపడింది. గతంలలో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్‌ వెంకటరమణను తొలగిస్తున్నట్టు జారీ చేసిన జీవోలను తొలగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. 


అప్పట్లో ఉన్నత విద్యామండలి మొదటి చైర్మన్‌‌గా ఉన్న తుమ్మల పాపిరెడ్డికి 65 సంవత్సరాలు దాటడంతో హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను తొలగించింది. ఆ క్రమంలో 2021, ఆగస్టు 24న ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జీ చైర్మెన్‌గా లింబాద్రిని నియమించింది. ఆ తర్వాత గతేడాది జూన్‌ 26న పూర్తిస్థాయి చైర్మెన్‌గా లింబాద్రిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగుతారని స్పష్టం చేసింది. అంటే 2025, జూన్‌ 25 వరకు లింబాద్రి కొనసాగే అవకాశమున్నది.


లింబాద్రి స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామం. దళిత కుటుంబంలో పుట్టిన ఆయన విద్యార్థి దశలో పీడీఎస్‌యూలో పనిచేశాడు. వివాదరహితుడిగా పేరున్న ఆయన ఆర్మూర్‌ డివిజన్‌లో రైతు కూలీ సంఘంలో పనిచేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, పీహెచ్డీ పట్టా పొందిన ఆయన.. సికింద్రాబాద్‌ పీజీ కాలేజీకి వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. కొన్నాళ్లు ఉన్నత విద్యామండలి సభ్యుడిగా కొనసాగిన ఆయన.. అనంతరం రెండేళ్ల పాటు ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. గతేడాది జులైలో పూర్తి స్థాయిలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదట ఆయన తొలగించాల్ని భావించినప్పటికీ.. ఆయననే ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించింది.


ప్రభుత్వానికి కృతజ్ఞతలు: లింబాద్రి
ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి నూతన చైర్మెన్‌ లింబాద్రి నవతెలంగాణతో మాట్లాడుతూ చైర్మెన్‌గా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత విద్య అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యారంగంలో మార్పులకు శ్రీకారం చుడతామని అన్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..