Salman Khan Upcoming Movie With AR Murugadoss: ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోల్లో సౌత్ దర్శకుల పట్ల క్రేజ్ పెరిగిపోయింది. సౌత్ దర్శకులు తమకు కచ్చితంగా హిట్స్ ఇవ్వగతరు అనే నమ్మకం ఆ హీరోల్లో పెరిగిపోయింది. దానికి బెస్ట్ ఉదాహరణ ‘జవాన్’ సినిమా. షారుఖ్ ఖాన్ మొదటిసారి అట్లీతో చేతులు కలిపి ‘జవాన్’లో నటించాడు. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో పాటు అవార్డుల పంట పండించింది. దీంతో షారుఖ్ రూటులోనే సల్మాన్ ఖాన్ కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తన అప్‌కమింగ్ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్‌ను సల్మాన్ స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ హ్యాపీ చేశాడు.


బాలీవుడ్‌లోనూ దర్శకుడికి క్రేజ్..


సాజిద్ నడియాద్వాల నిర్మాణంలో సల్మాన్ ఖాన్ అప్‌కమింగ్ మూవీ తెరకెక్కనుంది. ఇక ఈ మూవీని డైరెక్ట్ చేసే సౌత్ డైరెక్టర్ మరెవరో కాదు.. ఏఆర్ మురుగదాస్. మురుగదాస్‌కు హిందీ సినిమాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలకు హిట్లు కూడా అందించారు ఈ డైరెక్టర్. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో చేతులు కలపనున్నాడు. మురుగదాస్ సక్సెస్ ఫార్ములా చాలా సింపుల్‌గా ఉంటుంది. తను తమిళంలో తెరకెక్కించిన సినిమాలనే హిందీలో స్టార్ హీరోలతో కలిసి రీమేక్ చేస్తూ.. హిట్లు అందుకుంటూ ఉంటారు ఈ సీనియర్ దర్శకుడు. చివరిగా 2020లో రజినీకాంత్‌తో తెరకెక్కించిన ‘దర్బార్’ మురుగదాస్ ఆఖరి చిత్రం కాగా.. ఇప్పుడు సల్మాన్‌తో హిందీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.


ఇది చాలా స్పెషల్..


‘అద్భుతమైన టాలెంట్ ఉన్న ఏ ఆర్ మురుగదాస్‌తో పాటు నా ఫ్రెండ్ సాజిద్ నడియాద్వాలతో ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం చాలా ఆనందంగా ఉంది. ఈ కలయిక చాలా స్పెషల్. మీ ప్రేమ, ఆశీస్సులతో ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లడానికి ఎదురుచూస్తున్నాను. 2025 ఈద్‌కు రిలీజ్ అవుతుంది’ అని సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్ చేశాడు. దీంతో తన అప్‌కమింగ్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వడం మాత్రమే కాకుండా రిలీజ్ డేట్‌ను చెప్పేసినందుకు ఫ్యాన్స్ డబుల్ హ్యాపీ అవుతున్నారు. ఎంతైనా సల్మాన్ ఖాన్‌కు ఈద్ అనేది కలిసొచ్చే పండగ కాబట్టి అప్పుడు విడుదల అయితే సినిమా కచ్చితంగా హిట్టే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






హిట్ కాంబినేషన్..


సల్మాన్ ఖాన్, సాజిద్ నడియాద్వాల స్నేహం ఈనాటిది కాదు. వీరిద్దరూ కలిసి గతంలో కూడా సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. వీరి కాంబినేషన్‌లో ‘జుడ్వా’, ‘ముఝ్సే షాదీ కరోగీ’, ‘కిక్’ లాంటి సినిమాలు వచ్చి సూపర్ హిట్‌ను అందుకున్నాయి. ఇక బాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాజిద్.. సల్మాన్ హీరోగా నటించిన ‘కిక్‌’తోనే దర్శకుడిగా మారారు. అయితే ఇప్పుడు మురుగదాస్‌తో సల్మాన్ చేస్తున్న ప్రాజెక్ట్‌పై కూడా ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ‘కిక్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుందని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతైనా దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చేవరకు కన్ఫర్మ్ చేయలేమంటున్నారు ఫ్యాన్స్.


Also Read: పాకిస్థాన్‌లో నాగార్జునను పోలిన వ్యక్తి - వీడియోలతో లక్షల్లో సంపాదన