The team of 'Hanuman' met with Amit Shah: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘హనుమాన్‘. మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. టాప్ హీరోల సినిమాలను వెనక్కినెట్టి సంక్రాంతి స్టార్ మూవీగా నిలిచింది. కలెక్షన్ల విషయంలోనూ దూసుకెళ్లింది. సుమారు రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ప్రస్తుతం సీక్వెల్ పనుల కొనసాగుతున్నాయి. ‘జై హనుమాన్’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తయ్యాయి. 2025 సంక్రాంతి నాటికి ‘జై హనుమన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


కేంద్ర హోమంత్రితో ‘హనుమాన్’ టీమ్ భేటీ


తాజాగా ఈ సినిమా హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు.  తెలంగాణ పర్యటకు వచ్చిన ఆయనను హైదరాబాద్ లో మీటయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ‘హనుమాన్’ టీమ్ ను హోంమంత్రి దగ్గరికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సుమారు 40 నిమిషాల పాటు వారి సమావేశం కొనసాగింది. ‘హనుమాన్’ సినిమా సాధించిన విజయంతో పాటు సీక్వెల్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. రెండో భాగం థీమ్ నూ షాకు వివరించారు.  ఈ సందర్భంగా ‘హనుమాన్’ టీమ్ ను అమిత్ షా అభినందించారు. ఈ సినిమా విజయం చారిత్రాత్మకం అన్నారు. అటు అమిత్ షాకు ‘హనుమాన్’ టీమ్ హనుమంతుడి విగ్రహాన్ని బహుమతిగా అందించారు. ఇక ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వంగానే జరిగిందని బీజేపీ నేతలు తెలిపారు. ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదని వెల్లడించారు.






జియో సినిమాలో ‘హనుమాన్’ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్


ఇక థియేటర్లలో మంచి సక్సెస్ అందుకున్న ‘హనుమాన్’ సినిమా త్వరలో ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. హిందీ వెర్షన్ కు సంబంధించి ఓటీటీ విడుదలపై క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జీ5 ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ‘హనుమాన్’ హిందీ వెర్షన్ మాత్రం మార్చి 16న జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. జీ5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్స్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయో ఇంకా క్లారిటీ రాలేదు.     


ఇక ‘హనుమాన్’ మూవీ తేజ సజ్జ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కింది. ‘జాంబీ రెడ్డి’, ‘ఇష్క్’, ‘అద్భుతం’ లాంటి సినిమాల్లో నటించిన తేజకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేదు. ‘హనుమాన్’ మూవీతో ఏకంగా స్టార్ హీరోగా రేంజికి ఎదిగారు. ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ షెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు.  ప్రైమ్ షో పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.


Read Also: ‘హనుమాన్‘ to 'భ్రమయుగం' - ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న రెండు డజన్ల సినిమాలు