సినిమా ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు దక్కించుకోవటం చాలా కష్టమైన పని. ఒకవేళ అవకాశం దక్కినా... తమను తాము నిరూపించుకుని నిలబడటం ఇంకా కష్టం. చాలా అరుదు. తనకు లభించిన చిన్న చిన్న అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకుని తమ ప్రతిభ ఏంటనేది నిరూపించుకున్న తార సాయి పల్లవి. అభిమానుల దృష్టిలో ఆమె ఒక సూపర్ స్టార్. సాయి పల్లవి ప్రయాణంలో ఈ ఐదు ఆసక్తికరమైన అంశాలు మీకు తెలుసా?


డ్యాన్స్ షోతో వెలుగులోకి...
సాయి పల్లవి శాంతామరై తమిళనాడులోని  కోటగిరి లో 1992 మే 9న జన్మించారు. విజయ్ టీవీలో 2008లో వచ్చిన 'ఉంగలిల్ యార్ ఆడుతా ప్రభుదేవా' డ్యాన్స్ రియాలీటీ షోతో వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత ఏడాది తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ 4'లో పార్టిసిపేట్ చేశారు. తెలుగు ప్రజలకు ఆ షో ద్వారా ఆమె పరిచయమయ్యారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే... 'ఢీ 4' కంటే ముందే 2005లో 'కస్తూరి మాన్' అనే మలయాళ సినిమాలో, 2008లో 'ధామ్ ధూమ్' అనే తమిళ సినిమాలో సాయి పల్లవి బాలనటిగా చేశారు. 


సాయి పల్లవి యాక్టర్ మాత్రమే కాదు... డాక్టర్ కూడా!
'ఢీ' షో తర్వాత స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేసిన సాయి పల్లవి... జార్జియాలోని బిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయటానికి వెళ్లారు. అక్కడే మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ ఆమెను చూశారు. తన రాబోయే సినిమాలో హీరోయిన్ రోల్ ఆఫర్ చేశారట. 'యాక్టింగ్ ఇష్టం లేకపోయినా సెలవుల్లో వచ్చి నటించి వెళ్లు చాలు' అని ఆఫర్ ఇచ్చారట. దాంతో ఓకే అన్నారు సాయి పల్లవి. అలా ఆమె సెలవుల్లో నటించిన చిత్రమే 'ప్రేమమ్'. మలయాళంలోనే కాదు... సౌత్ సినిమాల్లో 'ప్రేమమ్' ఎంత సెన్సేషన్ గా నిలిచిందో అందరికీ తెలుసు. మలర్ టీచర్ పాత్రలో సాయి పల్లవి అభినయం చాలా మందికి ఫేవరేట్. ఆ తర్వాత మళ్లీ జార్జియా వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేసినా... ఆమెను సినిమా ఆఫర్స్ వెంటాడుతూనే ఉన్నాయి. సో ముందు డాక్టర్ అయ్యి... ఆ యాక్టర్ అయ్యారు సాయి పల్లవి.


సాయి పల్లవిని మెప్పించడం అంత సులభం కాదు!
సాయి పల్లవిని మెప్పించడం అంత సులభం కాదు! క్యారెక్టర్స్, ఫిల్మ్స్ ఎంపికలో ఆమె చాలా సెలక్టివ్. ఆచి తూచి పాత్రలను ఎంపిక చేసుకుంటారు. స్కిన్ షో ఆమెకు అసలు నచ్చని వ్యవహారం. అందుకే చాలా పెద్ద సినిమాలను కూడా రిజెక్ట్ చేశారు. రీమేక్స్ కూడా ఆమెకు ఇష్టం లేదు. అందుకే, 'ప్రేమమ్'ను తెలుగులో  రీమేక్ చేసినప్పుడు అడిగితే... 'నో' చెప్పారట. మలయాళంలో ఆమె చేసిన పాత్రను తెలుగులో శ్రుతి హాసన్ చేశారు. అయితే... సాయి పల్లవికి వచ్చినంత పేరు శృతికి రాలేదు. 'భోళా శంకర్'లో చిరంజీవి చెల్లెలిగా నటించే అవకాశం వచ్చినా... రీమేక్స్ ఇష్టం లేక నో చెప్పారట. ఆ సినిమా గురించి 'లవ్ స్టోరీ' ప్రీ రీలీజ్ లో సాయి పల్లవిని చిరంజీవి ఆటపట్టించారు కూడా. రోల్స్ అండ్‌ స్క్రిప్ట్ విషయంలో అంత పక్కాగా ఉంటుంది కాబట్టే సాయి పల్లవి కంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 
Also Read: సాయి పల్లవికి పేరు తీసుకొచ్చిన క్యారెక్టర్లు



డ్యాన్సే కాదు... అంతకు మించి!
తెలుగులో సాయి పల్లవి నటించిన 'ఫిదా', 'పడి పడి లేచే మనసు', 'ఎంసీఏ', 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగ రాయ్', ఇప్పుడు రాబోతున్న 'విరాటపర్వం'.... ఏ సినిమాలో చూసినా ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. పాత్రల పరంగానే కాదు... డ్యాన్స్ పరంగానూ సాయి పల్లవి తనదైన ముద్ర వేశారు. ఆమె అద్భుతమైన డ్యాన్సర్ కదా! 'రౌడీ బేబీ' సాంగ్ దగ్గర నుంచి 'వచ్చిండే', 'సారంగ దరియా', 'ప్రణవాలయ'... ఏ పాట తీసుకున్నా యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. ఆమె డ్యాన్స్ లో ఉన్న గ్రేస్ ఆ పాటలను చార్ట్ బస్టర్స్ గా నిలిపాయి. అవలీలగా స్టెప్పులు వేయటం ఆమెకు అడ్వాంటేజ్. ఇక, ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ అయితే పీక్స్ అసలు.
Also Read: ఆడపిల్లను కదా, నన్ను నమ్మవు! - 'గార్గి' ఫస్ట్ లుక్‌తో స‌ర్‌ప్రైజ్‌ చేసిన సాయి పల్లవి


క్రమశిక్షణ
సినిమాల విషయంలో సాయి పల్లవిఎంత క్రమశిక్షణగా ఉంటారో... నిజ జీవితంలో అలాగే ఉంటారు. చాలా సున్నిత మనస్కురాలు. ఎక్కువ ఎమోషనల్ అవుతారు. ఆమెలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. సాయిబాబాకు పెద్ద భక్తురాలు. సినిమా చిత్రీకరణలో లేకపోతే... ఆమె చేతిలో ఎప్పుడూ జపమాల ఉంటుంది. ఇక, ఫ్యాన్స్  చూపిస్తున్న ప్రేమకు సినిమా వేడుకల్లో భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఆమెకు ఎంత క్రేజ్ ఉందంటే... సుకుమార్ 'లేడీ పవర్ స్టార్' అని బిరుదు ఇచ్చేంత. అఫ్ కోర్స్... ఆమెకు ఇప్పుడున్న ఫ్యాన్ బేస్ అలాంటాది. సావిత్రి, సౌందర్య తర్వాత అంతలా తన రోల్స్ పై కమాండ్ ఉన్న యాక్ట్రెస్. రేర్ పీస్. హ్యాపీ బర్త్ డే సాయి పల్లవి.
Also Read: విజయ్ దేవరకొండ కెరీర్‌లో చేసిన సినిమాలు ఎన్ని? విజయాలు ఎన్ని?