యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7న) థియేటర్లోకి వస్తుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన 'ఒక పథకం ప్రకారం' (Oka Pathakam Prakaram) విడుదల కూడా ఆ రోజే. పెద్ద సినిమాతో పోటీ గురించి సాయిరాం శంకర్ ఏమన్నారో తెలుసా?
'తండేల్'తో పాటు కాదు... 'తండేల్' పక్కన!Sai Ram Shankar Interview: నాగ చైతన్య గారి 'తండేల్' సినిమాతో మాకు పోటీ ఏముందండి? అని సాయిరాం శంకర్ ప్రశ్నించారు. ''మేం ఆ సినిమాకు పోటీగా లేదా ఆ సినిమాతో పాటు రిలీజ్ చేయడం లేదు. మా 'ఒక పథకం ప్రకారం' సినిమాను 'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం'' అని సాయిరాం శంకర్ వివరించారు.
పాతిక కుక్కలతో క్లైమాక్స్ షూటింగ్... మామూలుగా కాదు!'ఒక పథకం ప్రకారం' పతాక సన్నివేశాల కోసం పాతిక కుక్కలతో షూటింగ్ చేశామని సాయిరాం శంకర్ తెలిపారు. క్లైమాక్స్ గురించి ఆయన మాట్లాడుతూ... ''నేను లొకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పాతిక కుక్కలు ఉన్నాయి. మొదట నాలుగు రోజులు షూటింగ్ చేశాం. ఆ సీన్స్ తీసేటప్పుడు ఒక డాగ్ బయటకు రావడంతో గ్రిల్ ఎక్కేశాను. లక్కీగా ఎస్కేప్ అయ్యా. ఫైట్ బాగా వచ్చింది. అయితే అది సరిపోదు అని మరోసారి క్లైమాక్స్ షూట్ చేశారు. మళ్లీ ఏడు ఎనిమిది రోజులు షూటింగ్ చేశాం. మొత్తం మీద చాలా బాగా వచ్చింది'' అని చెప్పారు.
ప్రేమ కథ నేపథ్యంలో తీసిన క్రైమ్ సినిమా 'ఒక పథకం ప్రకారం' అని సాయిరాం శంకర్ తెలిపారు. సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ తన ప్లానింగ్ తాను చేసుకుంటుందని, అందుకే 'ఒక పథకం ప్రకారం' అని టైటిల్ ఖరారు చేశామని తెలిపారు. ఇంకా సినిమా గురించి ఆయన మాట్లాడుతూ... ''ఇందులో నేను క్రిమినల్ లాయర్ రోల్ చేశా. అయితే ఇతను క్రిమినల్ లాయరా? లేదంటే క్రిమినలా? అనేలా ఉంటుంది. నా పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఈ క్యారెక్టర్ కోసం నెల రోజులు ట్రైనింగ్ తీసుకుని వర్క్ షాప్స్ కూడా చేశా. నాకు మంచి సంతృప్తినిచ్చిన చిత్రం ఇది. తప్పకుండా ప్రేక్షకులు అందరిని ఆకట్టుకుంటుంది'' అని చెప్పారు.
మలయాళ దర్శక నిర్మాత వినోద్ కుమార్ విజయన్ ఈ 'ఒక పథకం ప్రకారం' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. దీనికి దర్శకత్వం వహించడంతో పాటు గార్లపాటి రమేష్ తో కలిసి ప్రొడ్యూస్ చేశారు. ఇందులో 'పటాస్' ఫేమ్ శృతి సోది, ఆషిమా నర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సముద్రఖని ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. కథానాయకుడిగా తనకు మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ అందుకుంటానని విశ్వాసాన్ని సాయిరాం శంకర్ వ్యక్తం చేశారు.