సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రాణాలు కాపాడిన అబ్దుల్ పర్హాన్‌కు మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సాయం అందలేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సాయి ధరమ్ తేజ్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. అబ్దుల్‌కు తాను సాయం చేశానని ఎక్కడా చెప్పలేదని, ఆయనకు ఏ సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రమే చెప్పానని స్పష్టత ఇచ్చాడు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని పేర్కొన్నాడు. 


ఏం జరిగింది?


సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు అబ్దుల్, అతడి స్నేహితుడు సాయం చేశారు. వెంటనే తేజ్‌ను హాస్పిటల్‌కు తరలించారు. సమయానికి హాస్పిటల్‌లో చేర్చడం వల్ల సాయి ధరమ్ తేజ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత ‘విరూపాక్ష’ సినిమాలో కూడా నటించాడు. గతవారం విడుదలైన ‘విరూపాక్ష’ మూవీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే, ఓ యూట్యూబ్ చానెల్‌.. ఇటీవల సాయి ధరమ్ తేజ్‌ను కాపాడిన అబ్దుల్ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. ఈ సందర్భంగా అతడు తనకు సాయి ధరమ్ తేజ్ టీమ్ నుంచి ఎలాంటి సాయం అందలేదని వెల్లడించారు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డాడని వివరించాడు. అబ్దుల్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో సాయి ధరమ్ తేజ్ స్పందించక తప్పలేదు. 


అబ్దుల్‌కు సాయి ధరమ్ తేజ్ నుంచి సాయం అందలేదంటూ వస్తున్న వార్తలపై సాయి ధరమ్ తేజ్ ట్వీట్టర్ ద్వారా స్పందించాడు. ‘‘నా మీద, నా టీమ్ మీద ఒక తప్పుడు సమాచారం చక్కర్లు కొడుతున్నట్లు ఈ రోజే తెలిసింది. నేను గానీ, నా టీమ్ గానీ అబ్దుల్ ఫర్హాన్‌కు సాయం చేశామని ఎక్కడా చెప్పలేదు. కావాలంటే మీరు ఈ వీడియో (ఇంటర్వ్యూ) చూడవచ్చు. ఆయన నాకు, నా ఫ్యామిలీకి చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఆయన దగ్గర మా వివరాలున్నాయని, సాయం కావాలంటే ఆయన ఎప్పుడైనా మా వద్దకు రావచ్చని చెబుతూ వస్తున్నా. నా మేనేజర్ శరణ్ ఎప్పుడూ ఆయనకు అందుబాటులో ఉంటారు. ఈ విషయంలో ఇదే నా చివరి వివరణ’’ అని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు.


అబ్దుల్ ఏం చెప్పాడంటే..
 
తాజాగా ఈ వ్యాఖ్యలపై అబ్దుల్‌ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పాటు సాయి ధరమ్ తేజ్ ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు చెప్పిన విషయాల గురించి వివరించారు. వాస్తవానికి సాయి ధరమ్ తేజ్ ను కాపాడి, హాస్పిటల్ కు తరలించిన తర్వాత తనను ఎవరూ కలవలేదని చెప్పారు. సాయి ధరమ్ తేజ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తన దగ్గరికి రాలేదన్నారు. ఫోన్ నెంబర్ ఇచ్చి, కాల్ చేయమని సాయి ధరమ్ తేజ్ చెప్పడం కూడా అవాస్తవం అన్నారు. తనకు ఎవరు సాయం చేయలేదని, ఎవరి నుంచి ఎలాంటి కాల్స్ రాలేదన్నారు. ఇప్పటికైనా అవాస్తవ ప్రచారాన్ని ఆపాలని కోరారు.


Also Read: సాయి ధరమ్ తేజ్‌‌ను కాపాడిన వ్యక్తికి సాయం అందలేదా? - షాకింగ్ విషయాలు చెప్పిన అబ్దుల్