డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటారు. 24 క్రాఫ్ట్స్ ను సమన్వయ పరుచుకుంటూ, తమ కథలను వెండితెర మీదకు తీసుకొస్తుంటారు. అయితే వారిలో కొందరు దర్శకులు మాత్రం మెగా ఫోన్ పట్టుకొని దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడమే కాదు, కెమెరా ముందుకొచ్చి తమలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. యాక్టర్స్ గా రాణిస్తున్న ఆ దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం!


ఎస్‌.జె. సూర్య:
‘ఖుషి’ వంటి కల్ట్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ఎస్‌.జె. సూర్య.. ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నారు. అదిరింది, స్పైడర్‌, ది లూప్‌, మార్క్ ఆంటోనీ వంటి చిత్రాల్లో విలన్ గా మెప్పించారు. ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్‌' చిత్రంతో పాటుగా ‘సరిపోదా శనివారం’, ‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’, D50 సినిమాల్లో నటిస్తున్నారు. 


సెల్వరాఘవన్:
'7/G బృందావన కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలతో డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సెల్వ రాఘవన్.. 'బీస్ట్' మూవీతో యాక్టర్ గా మారాడు. ప్రెజెంట్ డైరెక్షన్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్నాడు. చిన్ని, ఫర్హానా, మార్క్ ఆంటోనీ చిత్రాలతో మెప్పించారు. రవితేజ నటిస్తున్న RT4GM సినిమాతో నటుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.


గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్:
‘ఘర్షణ’ ‘ఏమాయ చేసావే’, 'సూర్య S/o కృష్ణన్', రాఘవన్, ఏటో వెళ్లిపోయింది మనసు, 'సాహసం శ్వాసగా సాగిపో' వంటి సినిమాలతో దర్శకుడిగా మెప్పించారు గౌతమ్‌ మీనన్. ప్రస్తుతం యాక్టర్ గా వరుస సినిమాలు చేస్తున్నారు. ట్రాన్స్, సీతారామం, మైఖేల్‌, ఉస్తాద్, లియో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఆయన డైరెక్ట్ చేసిన 'ధృవ నక్షత్రం' సినిమా త్వరలో విడుదల కానుంది. 


సముద్రఖని:
‘శంభో శివ శంభో’, జెండాపై కపిరాజు, ‘బ్రో’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సముద్ర ఖని.. నటుడిగా బిజీ అయిపోయారు. అల వైకుంఠపురంలో, క్రాక్, సర్కారు వారి పాట, ఆర్‌ఆర్‌ఆర్‌, మాచర్ల నియోజకవర్గం, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్, విమానం తదితర సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


మిస్కిన్:
పిశాచి, డిటెక్టివ్, సైకో చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ మిస్కిన్.. యాక్టర్ గానూ రాణిస్తున్నారు. సూపర్ డీలక్స్, మహావీరుడు చిత్రాల్లో విలన్ గా నటించిన మిస్కిన్.. రీసెంట్ గా వచ్చిన 'లియో' మూవీలోనూ మెరిశారు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తోన్న 'పిశాచి 2' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


తరుణ్ భాస్కర్:
పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ధాస్యం. మహానటి సినిమాలో మెరిసిన తరుణ్.. ఫలక్ నుమా దాస్, మీకు మాత్రమే చెప్తా, సీతా రామం, దాస్ కా ధమ్కీ, హాస్టల్ బాయ్స్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కీడా కోలా' మూవీలో కీలక పాత్ర పోషించారు.


శ్రీకాంత్‌ అడ్డాల:
‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఫీల్ గుడ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెదకాపు-1’ సినిమాతో నటుడిగా మారాడు. ఇందులో నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు.


కేవీ అనుదీప్‌:
'పిట్టగోడ' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన అనుదీప్.. ‘జాతిరత్నాలు’, పిన్స్ చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. తను డైరెక్ట్ చేసిన సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించే అతను.. ఫస్ట్ డే ఫస్ట్ షో, మ్యాడ్‌ మూవీల్లో నటించాడు.


వెంకటేశ్ మహా:
C/o కంచెరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేశ్ మహా. అయితే అవకాశం వచ్చినప్పుడల్లా బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. స్టాండప్ రాహుల్, అంటే సుందరానికి చిత్రాల్లో నటించిన మహా.. లేటెస్టుగా థియేటర్లలోకి వచ్చిన 'మార్టిన్ లూథర్' మూవీలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం 'మర్మానువు' అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.


శ్రీను గవిరెడ్డి:
'అనుభవించు రాజా' సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీను గవిరెడ్డి.. ఇటీవల 'కుమారి శ్రీమతి' వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించారు. గతంలో క్రాక్, వీర సింహా రెడ్డి చిత్రాల రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. ప్రస్తుతం రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కే RT4GM సినిమాకి రైటర్ గా చేస్తున్నారు.


కరుణ కుమార్‌:
‘పలాస 1978’, 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కరుణ కుమార్‌. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంతో తొలిసారి తెరపై కనిపించిన ఆయన.. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామిరంగ’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.


గతంలో కె. విశ్వనాథ్, జంధ్యాల లాంటి దర్శకులు వెండితెరపై నటులుగా రాణించారు. కె. రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’ సినిమాతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. పూరీ జగన్నాథ్, వీవీ వినాయక్, కాశీ విశ్వనాథ్, రవిబాబు, బీవీఎస్ రవి, పోసాని కృష్ణమురళి, బెజవాడ రౌడీలు ఫేమ్ వివేక్ కృష్ణ లాంటి మరికొందరు దర్శకులు బిగ్ స్క్రీన్ మీద అలరిస్తున్న సంగతి తెలిసిందే.


Also Read: 'బిగ్‌ బాస్‌ బోగస్ అన్నప్పుడే నేను వెళ్లకుండా ఉండాల్సింది'.. సీజన్-2 విన్నర్ కౌశల్ కామెంట్స్ వైరల్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial