Ruhani Sharma: ముగ్గురు సక్సెస్‌ఫుల్ హీరోలు, ఒక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టే హీరోయిన్ కలిసి చేస్తున్న చిత్రమే ‘శ్రీరంగనీతులు’. మిడిల్ క్లాస్ కథలతో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారని ఇప్పటికే మూవీ టీజర్ చూస్తే అర్థమవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా బయటికొచ్చింది. దీంతో ‘శ్రీరంగనీతులు’ గురించి ప్రేక్షకులకు మరింత తెలిసేలా చేయడం కోసం మూవీ టీమ్ ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అయితే అందులో సంబంధం లేని ఒక ప్రశ్న అడగడంతో హీరోయిన్ రుహానీ శర్మ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఆ ప్రశ్న తనకు నచ్చలేదని సమాధానం చెప్పనని సూటిగా చెప్పేసింది.


షాకైన రుహానీ..


టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రుహానీ శర్మ.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మకు కజిన్. అయితే తాజాగా జరిగిన ‘శ్రీరంగనీతులు’ ప్రెస్ మీట్‌లో అదే ప్రస్తావన వచ్చింది. ‘‘మీ సినిమాలను మీ బావ విరాట్ కోహ్లీ, మీ అక్క అనుష్క శర్మ చూస్తుంటారా’’ అని రుహానీకి ప్రశ్న ఎదురయ్యింది. ఇలాంటి ప్రశ్న ఎదురవుతుందని ఊహించని రుహానీ ముందుగా షాక్ అయ్యింది. ‘‘సినిమా గురించి మాట్లాడదాం’’ అని నవ్వుకుంటూ చెప్పింది. అయినా కూడా పదేపదే అదే ప్రశ్న అడగడంతో ‘‘సారీ.. నేను దానిగురించి మాట్లాడను’’ అని చెప్పి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ అయిపోయింది.


సొంతంగా గుర్తింపు..


చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలకు బాలీవుడ్‌లో కజిన్స్ ఉన్నారు. అయినా కూడా వారు ఎక్కువ శాతం సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటారు. అలాగే రుహానీ శర్మ కూడా ‘హిట్’, ‘చిలసౌ’ లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏప్రిల్ 11న ‘శ్రీరంగనీతులు’తో మరోసారి ఆడియన్స్‌ను మెప్పించడానికి వచ్చేస్తోంది. ఇందులో సుహాస్, విరాజ్ అశ్విన్, కార్తిక్ రత్నం హీరోలుగా నటిస్తుండగా.. హీరోయిన్‌గా మాత్రం రుహానీ శర్మ ఒక్కత్తే కనిపిస్తోంది. ఈ సినిమాలో తను మాత్రమే హీరోయినా? అని ప్రేక్షకులకు వస్తున్న సందేహాలపై కూడా తను క్లారిటీ ఇచ్చింది. ‘‘సినిమాలో ఒక్క హీరోయినే అయినా ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. అందుకే నేను చేశాను’’ అని చెప్పుకొచ్చింది.


కనెక్ట్ అయ్యాను..


‘‘క్యారెక్టర్‌కు నేను చాలా కనెక్ట్ అయ్యాను. అమ్మాయిలు చాలా కష్టపడడం నేను చూశాను. నా చుట్టూ ఇలాంటి పరిస్థితులు చూశాను’’ అని ‘శ్రీరంగనీతులు’లో తన పాత్ర గురించి చెప్పింది రుహానీ శర్మ. అయితే ట్రైలర్ చూసిన తర్వాత విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ.. ఒక కపుల్‌గా కనిపించనున్నారని అర్థమవుతోంది. అసలు వారిద్దరి ప్రేమకథ ఎలా ఉండబోతుందో వెండితెరపై చూసి తెలుసుకోమన్నాడు విరాజ్. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్  ‘శ్రీరంగనీతులు’ను డైరెక్ట్ చేశాడు. రాధావి ఎంట‌ర్‌‌టైన్మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌ రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇది యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే కథ అని, మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ఉంటాయని, అందుకే ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Also Read: ముగ్గురు యువకుల కథలతో ‘శ్రీ‌రంగ‌నీతులు’ - ఆకట్టుకుంటున్న సుహాస్ కొత్త సినిమా ట్రైలర్