అంతర్జాతీయ అవార్డు వేదికలపై భారతీయ సినిమాను సగర్వంగా నిలబెట్టిన ఘనత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'కు దక్కుతుంది.
ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్'కు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి. 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. సోమవారం ఆస్కార్ కూడా వస్తుందని 'ఆర్ఆర్ఆర్' అభిమానులు, భారతీయ సినిమా ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ చాలా మందిని బాధ పెట్టాయి. ఆస్కార్స్ కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ 80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ డబ్బులతో ఎనిమిది సినిమాలు తీయవచ్చని ఇటీవల ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి కామెంట్ చేశారు. ఆయనకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా బదులు ఇచ్చారు.
గర్వపడాలి కానీ...
నీ దగ్గర లెక్కలు ఉన్నాయా?
''మిత్రుడు భరద్వాజ్ (Tammareddy Bharadwaj)కి... తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ సినిమా వేదికలపై మొదటిసారి వస్తున్న పేరు చూసి గర్వపడాలి. అంటే కానీ, 80 కోట్ల రూపాయలు ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా?'' అని కె. రాఘవేంద్ర రావు (K Raghavendra Rao) సూటిగా ప్రశ్నించారు.
ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి దర్శకులు డబ్బులు తీసుకుని మన సినిమా (ఆర్ఆర్ఆర్)ను పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అని తమ్మారెడ్డి ముందు మరో ప్రశ్న ఉంచారు. దీనికి తమ్మారెడ్డి ఏం బదులు ఇస్తారో చూడాలి.
రాయలేని భాషలో నాగబాబు!
'ఆర్ఆర్ఆర్' హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ బాబాయ్ నాగబాబు (Nagababu) అయితే రాయలేని భాషలో ట్వీట్ చేశారు. రాజకీయాలను లాగుతూ... ఏపీలోని అధికార ప్రభుత్వం వైసీపీ వారి భాషలో సమాధానం అంటూ తమ్మారెడ్డి భరద్వాజ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఘాటు రిప్లై ఇచ్చారు.
తమ్మారెడ్డి అసలు ఉద్దేశం ఏమిటి?
'నాటు నాటు...' పాటకు ఇంకా ఆస్కార్ రాలేదు. కానీ, అవార్డు రావడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. అయితే, ఆ అవార్డును 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తుందని అర్థం వచ్చేలా తమ్మారెడ్డి భరద్వాజ మాటలు ఉన్నాయని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన అసలు ఉద్దేశం వేరు అని కొందరు నెటిజనులు వివరిస్తుండటం గమనార్హం. ఫ్లైట్ టికెట్లకు 'ఆర్ఆర్ఆర్' టీమ్ పెట్టిన ఖర్చుతో ఎనిమిది సినిమాలు తీయవచ్చని మాత్రమే చెప్పారని పేర్కొంటున్నారు.
Also Read : గుండెల్లో దేశాన్ని నింపుకొని, భారతీయుడిగా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా - ఎన్టీఆర్
తమ్మారెడ్డి భరద్వాజ ఉద్దేశం ఏదైనప్పటికీ... ఆస్కార్ అవార్డులకు తెలుగు పాట వెళ్లినందుకు సంతోషపడటం మానేసి ఫ్లైట్ టికెట్లకు అనవసరంగా అంత ఖర్చు చేయడం అనవసరం అని కామెంట్ చేయడం తగదని రాజమౌళి, హీరో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
'ఆర్ఆర్ఆర్' టీమ్ 80 కోట్లు చేసిందని తమ్మారెడ్డి కామెంట్స్ చేసిన కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారు. అయితే, సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. 'బాహుబలి' కోసం ఆ రోజుల్లో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, బుర్ర ఉన్నవాళ్లు ఎవరూ ఆ విధంగా చేయరని, కానీ రాజమౌళి అనుకున్నది సాధించాడని తమ్మారెడ్డి పొగిడారు. మంచి కథ ఉంటే ఈ రోజుల్లో బడ్జెట్ అనేది పెద్ద సమస్య కాదన్నారు. నిర్మాతలు ఎవరూ దొరక్కపోతే అప్పు చేసి అయినా సరే సినిమా తీయమన్నారు. ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని, సినిమా విజయం సాధిస్తే గొప్పవాళ్ళు అవుతారని, లేదంటే తమలా మిగులుతారని సెల్ఫ్ సెటైర్ వేసుకున్నారు.
Also Read : స్టార్ హీరో సమాధానం చెప్పాలి - ప్లకార్డుతో హీరో ఇంటి ముందు వెంకటేష్ మహా ధర్నా