తమిళ హీరో ధనుష్ ఎలాంటి హడావిడి లేకుండా సినిమాలు విడుదల చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. తాజాగా ‘సార్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో నేరు గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ధనుష్, మంచి ఆదరణ దక్కించుకున్నారు. ధనుష్ సినిమాలపై దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ‘RRR’ ప్రమోషన్ కోసం అమెరికాలో ఉన్నారు జక్కన్న. ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడంతో ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో, ప్రతి ఒక్కరూ చూడవలసిన ఐదు ఇండియన్ సినిమాలను చెప్పాలని దర్శకుడిని కోరినప్పుడు వెంటనే ధనుష్, వెట్రిమారన్ ‘ఆడుకులం’ అని చెప్పారు.
రాజమౌళికి ‘ఆడుకలం’ టీమ్ కృతజ్ఞతలు
2011లో విడుదలైన ధనుష్, వెట్రిమారన్ చిత్రం ‘ఆడుకలం’ ఉత్తమ తమిళ చిత్రాల్లో ఒకటని రాజమౌళి వెల్లడించారు. రాజమౌళి ప్రశంస పట్ల ‘ఆడుకలం’ నిర్మాతలు ట్విట్టర్ వేదికగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తమ చిత్రం దిగ్గజ దర్శకుడికి నచ్చడం సంతోషాన్ని కలిగిస్తుందని వెల్లడించారు. “మా ప్రాజెక్ట్ ‘ఆడుకలం’పై దేశంలోని అత్యుత్తమ చిత్ర దర్శకులలో ఒకరైన రాజమౌళి అభినందనలు కురిపించినందకు సంతోషిస్తున్నారు. రాజమౌళి గారు, మీరు సిఫార్సు చేసిన సినిమాలలో మా సినిమా గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు” అని తెలిపారు.
‘ఆడుకలం’ సినిమాకు జాతీయ అవార్డుల పంట
దర్శకుడు వెట్రిమారన్, ప్రముఖ తమిళ హీరో ధనుష్ కాంబోలో ‘ఆడుకలం’ సినిమా తెరకెక్కింది. ఎస్ కతిరేసన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. విక్రమ్ సుగుమారన్‌తో కలిసి వెట్రిమారన్ స్క్రీన్ ప్లే, డైలాగులు రాశారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించింది. కిషోర్, జయపాలన్, నరేన్, మురుగదాస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 14 జనవరి 2011న విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. 58వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటుడు సహా 6 అవార్డులను గెలుచుకుంది.
ఆస్కార్ కు అడుగు దూరంలో రాజమౌళి ‘RRR’
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ 2023కి నామినేట్ అయ్యింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డును అందుకుంది. ప్రస్తుతం ‘RRR’ టీమ్ మొత్తం ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అమెరికాలో ఉంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇప్పటికే గీత రచయిత చంద్రబోస్‌తో కలసి అమెరికాకు వెళ్లారు. రామ్ చరణ్ న్యూయార్క్ లో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి త్వరలో వారి కుటుంబ సభ్యులతో అమెరికాకు వెళ్లనున్నారు. ఆస్కార్ 2023 ఈవెంట్ మార్చి 12న జరగనుంది. ‘RRR’ అనేది స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పాత్రలతో తెరకెక్కింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అల్లూరి, భీమ్ పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్ కీలక పాత్రల్లో నటించారు.
Read Also: శంకర్ అదిరిపోయే ప్లాన్ - పండుగలే టార్గెట్‌గా చరణ్, కమల్ మూవీస్ రిలీజ్